Rohit sharma post match speech: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) గెలిచిన అనంతరం సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అభిమానులకు బాధను మిగిలిస్తూ హిట్‌మ్యాన్‌ వీడ్కోలు ప్రకటన చేసేశాడు.  140 కోట్ల మంది భారత అభిమానులకు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా(India) విజయాన్ని కానుకగా అందించింది. ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా(SA)ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుని బార్బడోస్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జెండా పాతాడు. 7 నెలల ముందే 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిపోయిన రోహిత్‌ సేన..ఈసారి మాత్రం విశ్వ విజేతలుగా నిలిచారు. కప్పు గెలిచిన తర్వాత పోస్ట్‌ ప్రజెంటేషన్‌లో రోహిత్‌ శర్మ సుదీర్ఘ ప్రసంగం చేశాడు. జట్టు ప్రయాణం అసలు ఎలా సాగిందో వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 

 

రోహిత్‌ ఏమన్నాడంటే..?

గత మూడు, నాలుగేళ్లలో తమ ప్రయాణం ఎలా సాగిందో క్లుప్తంగా చెప్పడం చాలా కష్టమని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. వ్యక్తిగతంగా, జట్టుగా ఇక్కడివరకూ రావడానికి చాలా కష్టపడ్డామని వివరించాడు. ఈరోజు విశ్వ విజేతలుగా నిలిచేందుకు తెరవెనక తాము చాల కష్టపడ్డామని రోహిత్‌ వెల్లడించాడు. ఓ దశలో దక్షిణాఫ్రికా గెలుస్తుందని అనిపించినా తమ జట్టు మాత్రం ధైర్యంగా నిలబడిందని టీమిండియా కెప్టెన్‌ అన్నాడు. ఒక జట్టుగా తాము విశ్వ విజేతలుగా నిలవాలని భావించామని... ట్రోఫీని వదలొద్దని మాత్రం గట్టిగా అనుకున్నామని తెలిపాడు. ఇలాంటి మెగా టోర్నమెంట్‌ను గెలవాలంటే తెరవెనుక చాలా కృషి ఉంటుందని రోహిత్‌ చెప్పాడు. తాము స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇచ్చారని.. దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు వచ్చిందన్నాడు హిట్‌ మ్యాన్‌. ఈ గెలుపుతో తాను చాలా గర్వపడుతున్నానని... తమలో ప్రతీ ఒక్కరికి వేరొకరిపై నమ్మకం ఉందన్నాడు. తాము టోర్నమెంట్ అంతా అద్భుతంగా ఆడామని రోహిత్‌ తెలిపాడు. 

 

విరాట్‌పై కీలక వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ ఫామ్‌పై తనకు ఎప్పుడూ సందేహం లేదని రోహిత్‌ తెలిపాడు. విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని.. అతను ఎంత ఉత్తమమైన ప్లేయరో అందరికీ తెలుసని చెప్పాడు. విరాట్ తమ జట్టులో చాలా కీలక ఆటగాడని... కీలకమైన మ్యాచుల్లో కోహ్లీ ఎలా ఆడుతాడో అందరికీ తెలుసని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. ఫైనల్లో విరాట్ అనుభవం తమకు పనికి వచ్చిందని... అక్షర్ 47 పరుగుల ఇన్నింగ్స్ కూడా చాలా ముఖ్యమైనదని టీమిండియా సారధి తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రాపై రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్‌ జట్టులో ఉంటే కెప్టెన్‌ ప్రశాంతంగా ఉంటాడని రోహిత్‌ తెలిపాడు. వికెట్‌ అవసరమైన ప్రతీసారి బుమ్రా తమకు వికెట్‌ అందించాడని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. బుమ్రా ఒక మాస్టర్ క్లాస్ అని  అన్నాడు. హార్దిక్ అద్భుతంగా ఆడాడని.. ఆఖరి ఓవర్ వేయడానికి బౌలర్లంతా సిద్ధంగా ఉంటున్నారని... తక్కువ పరుగులు ఉన్నా వాటిని కట్టడి చేసేందుకు ముందుకు వస్తున్నారని వారిని చూసి గర్వపడుతున్నానని రోహిత్ తెలిపాడు.