Imran Khan Praises PM Modi:
ఆస్తుల విషయంలో పొగడ్తలు..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తీవ్రంగా విమర్శించారు. లంచగొండితనం విషయంలో ప్రధాని మోదీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పోల్చుతూ...మోదీని పొగిడారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనన్ని విదేశీ ఆస్తులు నవాజ్ షరీఫ్‌కు ఉన్నాయని విమర్శించారు. ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ...ఈ వ్యాఖ్యలు చేశారు. "ఓ దేశం చట్ట ప్రకారం నడుచుకోకపోతే...పెట్టుబడులు రానే రావు. లంచగొండితనమూ పెరిగిపోతుంది. పాక్‌లో కాకుండా మరే దేశంలోనైనా ప్రధాని పదవి చేపట్టిన వారికి విదేశాల్లో ఇన్ని ఆస్తులున్నాయా..? మన పొరుగు దేశాన్నే తీసుకోండి. భారత్ ప్రధాని మోదీకి దేశంలో కాకుండా బయట ఎక్కడైనా ఆస్తులున్నాయా?" అని ప్రశ్నించారు. విదేశాల్లో నవాజ్ షరీఫ్‌కు ఉన్న ఆస్తుల విలువను ఎవరూ నమ్మలేనంత స్థాయిలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు ఇమ్రాన్ ఖాన్. అంతకు ముందు...భారత్ విదేశాంగ విధానాన్ని పొగిడారు ఇమ్రాన్. పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగు తున్నప్పటికీ..భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు చేయడాన్నీ ప్రశంసించారు.
గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు
పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్...ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ డిబేట్‌లో చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. రష్యా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్.. శత్రు దేశంంగా మారడం వల్ల వ్యాపారం చేయలేక పోతున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సమస్యలపై చర్చించుకోవడం ద్వారా వ్యాపార లావాదేవీలు పెరిగి రెండు దేశాలు లాభపడతాయని అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యనటకు వెళ్లే ముందు ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇమ్రాన్ ఖాన్ మాస్కో వెళ్లి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. 20 దశాబ్దాల్లో పాకిస్థాన్ ప్రధాని రష్యా వెళ్లడటం ఇదే తొలిసారి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అప్పుడు స్పందించలేదు. అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి పనిచేయవని ఎప్పటి నుంచో భారత్ స్పష్టం చేస్తోంది.
పాకిస్థాన్ సర్కార్ ముందు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు 2008 నుంచి 2019 వరకూ పాక్ జరిపిన ఉగ్రదాడుల్లో ఎంతోమంది భారత సైనికులు బలి అయ్యారు. ఆ దాడులను జరిపిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను అణిచివేయాలన్నది భారత్ ప్రధాన డిమాండ్. స్వతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో భారత్- పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగాయి. మోదీ సర్కార్.. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌తో వాణిజ్య బంధాలను వద్దనుకుంది. ఈలోగా...ఉన్నట్టుండి ప్రధాని పదవి నుంచి దిగిపోయారు ఇమ్రాన్ ఖాన్.