Modi Paid Tribute to Mahatma Gandhi: ఇవాళ సాయంత్రం 7.15 గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ని సందర్శించారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించానని వెల్లడించారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావం ఎంతో స్ఫూర్తిని పంచిందని అన్నారు. గొప్ప సమాజ నిర్మాణంలో ఆయన సిద్ధాంతాలు ఎప్పటికీ దోహదపడతాయని వెల్లడించారు.
ఆ తరవాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ముందుచూపు, నిబద్ధత దేశానికి ఎంతో మేలు చేశాయని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రతి మాట దేశాభివృద్ధిలో తమకు స్ఫూర్తి పంచుతోందని తెలిపారు. ఎప్పటికీ ఆయన దారి చూపించే వెలుగులా ఉంటారని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రీయ సమర్ సమార్క్ వద్ద అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వాళ్లను గుర్తు చేసుకున్నారు. ఎనలేని ధైర్యంతో పోరాడిన సైనికులు విలువల కోసం ఎప్పటికీ కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. దృఢమైన దేశాన్ని నిర్మించాలన్న వాళ్ల కలను నెరవేర్చేందుకు స్ఫూర్తిని పంచారు.
సాయంత్రం 7.15 నిముషాలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7 దేశాలకు చెందిన అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వాళ్లందరికీ భారత్ ఘన స్వాగతం పలికింది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: PM Modi Oath Ceremony: మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్