Ram Mohan Naidu Pemmasani Chandrasekhar: కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ (జూన్ 9) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


గల్లా జయదేవ్ శుభాకాంక్షలు
టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్.. కేంద్ర మంత్రి పదవులకు ఎంపికైన ఇద్దరు టీడీపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. గల్లా జయదేవ్ గుంటూరు నుంచి గత రెండు సార్లు వరుసగా పోటీ చేసి నెగ్గిన సంగతి తెలిసిందే. తన వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అప్పటి ఏపీ రాజకీయాలు అడ్డు వస్తున్నాయనే కారణంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన పోటీ చేసిన గుంటూరు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో నిలిచి భారీ విజయం సాధించారు. దీంతో తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనుందని గల్లా జయదేవ్ ధ్రువీకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.



అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడుకు కూడా గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్ గా స్థానం ఖరారైనందుకు నా ఫ్రెండ్‌కి శుభాకాంక్షలు. నీ నిబద్ధత, వినయ స్వభావం దేశాభివృద్ధికి ఎంతో అవసరం’’ అని అన్నారు.