PM Modi Swearing In: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పలువురు ప్రతిపక్ష నేతలకూ ఆహ్వానం అందించింది. ఈ జాబితాలో ఖర్గే ఉన్నారు. I.N.D.I.A కూటమిలోని మిగతా పార్టీల నేతల్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కానీ ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని, తనకు వెళ్లాలని లేదని తేల్చి చెప్పారు. 




అంతకు ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టినట్టు కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు. ఇక సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సీనియర్ నేతలు ఈ పదవి తీసుకోవాలని ప్రతిపాదన తీసుకురాగా సోనియా అందుకు అంగీకరించారు. 


సాయంత్రం 7.15 నిముషాలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కర్తవ్యపథ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే మోదీ రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తరవాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు.