Mann Ki Baat:
ఆ తేదీల్లో అదే ప్రొఫైల్ పిక్‌గా ఉండాలి..
మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగష్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని DPగా పెట్టుకోవాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా అందరూ ఇది ఆచరించాలని కోరారు. "ఆగష్టు 13-15 వరకూ హర్ ఘర్ తిరంగ ఉద్యమం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే ఆగష్టు 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియాలో అందరూ త్రివర్ణ పతాకాన్నే ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోండి" అని చెప్పారు ప్రధాని మోదీ. ఆగష్టు 2 వ తేదీకి, త్రివర్ణ పతాకానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. "ఆగష్టు 2 వ తేదీన మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్బంగా ఆయనను నివాళినర్పిస్తున్నాను" అని వెల్లడించారు. ఇదే సమయంలో ఆజాదీ కీ రైల్‌గాడీ ఔర్ రైల్వే స్టేషన్ గురించి కూడా ప్రస్తావించారు. "స్వాతంత్య్రోద్యమంలో రైల్వే ఎలాంటికీలక పాత్ర పోషించిందో ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం" అని అన్నారు. ఈ మన్‌కీ బాత్ కార్యక్రమం జరగకముందు ప్రధాని మోదీ ఏ అంశంపై చర్చించాలనుకుంటున్నారో చెప్పండి అంటూ ప్రజలనే సూచనలు అడిగారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నమో యాప్ ద్వారా లేదా MyGov సైట్ ద్వారా ఈ సూచనలు చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని తన ట్విటర్‌లో షేర్ చేశారు.
హర్ ఘర్ తిరంగ ఉద్యమం..
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగ" (Har Ghar Tiranga)ఉద్యమంలో భాగంగా ఈ పని చేయాలని కోరారు. 1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, స్వేచ్ఛాయుత భారత పతాకాన్నిచూడాలని కలలు కన్న మహనీయులందరినీ తలుచుకోవాల్సిన సందర్భమిది. వారి స్ఫూర్తికి అనుగుణంగా, వారి కలలు నెరవేర్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని ఈ ఉద్యమం ఇంకా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్‌లు చేశారు.
Also Read: Hero Nikhil Controversial Comments: కార్తికేయ-2కు థియేటర్ల విషయంలో హర్ట్ అయిన హీరో నిఖిల్| ABP Desam