PM Modi Swearing In: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ నెహ్రూ రికార్డుని సమం చేశారు మోదీ. రాష్ట్రపతి భవన్‌ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికైంది. మరి ఈ బాధ్యతలు తీసుకుంటున్న ప్రధానికి జీతం ఎంతుంటుంది..? ఆయన నెల నెలా ఎంత సంపాదిస్తారు..? ప్రస్తుతం దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు ఎంత ఉంటాయో తెలుసుకుందాం. రాష్ట్రపతికి 2018 ముందు వరకూ నెలకి లక్షన్నర జీతం ఉండేది. ఆ తరవాత ఆ జీతాన్ని రూ.5 లక్షలకు పెంచింది ప్రభుత్వం. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్రకటన చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం వెల్లడించారు. 2006 జనవరిలో చివరిసారి రాష్ట్రపతి జీతంలో మార్పులు చేశారని, ఆ తరవాత 2018లో పెంచారు.


జీతం విషయంలోనే కాదు. రాష్ట్రపతికి ఆ హోదాకు తగ్గట్టుగానే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఫ్లైట్‌లో, ట్రైన్‌లో ఫ్రీగా ట్రావెల్ చేసేందుకు అవకాశముంటుంది. రాష్ట్రపతికి వైద్యం కూడా ఉచితంగానే అందుతుంది. రాష్ట్రపతి ఉండే ఇంటికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. అందులో రెండు ల్యాండ్‌ఫోన్స్‌, ఓ మొబైల్‌తో పాటు ఐదుగురు వ్యక్తిగత సిబ్బంది అందుబాటులో ఉంటుంది. రాష్ట్రపతి మృతి చెందాక భార్య లేదా భర్తకి వైద్యం ఉచితంగానే అందుతుంది. 


ప్రధాని జీతం ఎంతంటే.?


ఉప రాష్ట్రపతి జీతాన్నీ 2018లో మార్చారు అరుణ్ జైట్లీ. అంతకు ముందు రూ.1.25 లక్షలుగా ఉండగా దాన్ని రూ.4 లక్షలకు పెంచారు. రాష్ట్రపతి లాగే ఉపరాష్ట్రపతికీ దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశముంటుంది. వైద్యమూ ఉచితంగానే అందుతుంది. ఇంటికి అద్దె చెల్లించాల్సిన పని లేదు. ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌తో పాటు మొబైల్‌ ఉచితంగా అందిస్తారు. ఇక ప్రధానమంత్రి విషయానికొస్తే నెలకి రూ.1.66 లక్షల జీతం తీసుకుంటారు. సెక్యూరిటీ విషయంలో ప్రధానికి కాస్త అదనపు భద్రత ఉంటుంది. Special Protection Group దళాలు ప్రధానికి భద్రత కల్పిస్తారు. ప్రత్యేకంగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ అందుబాటులో ఉంటుంది. రేస్‌ కోర్స్‌ రోడ్‌లో అధికారిక నివాసంలో ప్రధాని నివసిస్తారు. 


మోదీ సూచనలు..


ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి 293 చోట్ల విజయం సాధించింది. అటు ఇండీ కూటమి 240 సీట్లలో గెలుపొందింది. మెజార్టీ వచ్చిన NDA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మూడోసారి మోదీయే ప్రధానిగా ఉండాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. కేబినెట్ కూర్పు విషయానికి వస్తే..బీజేపీ వద్ద కీలక శాఖలు ఉండనున్నాయి. హోం మంత్రిగా అమిత్‌షా, రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రిగా జైశంకర్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొనసాగున్నారు. మిత్రపక్షాలకు వేరే మంత్రిత్వ శాఖలు కేటాయించనుంది ప్రభుత్వం. పదేళ్లలో ఈ నలుగురు మంత్రులు ఆశించిన స్థాయిలో పని చేయడం వల్ల మళ్లీ వాళ్లకే బాధ్యతలు అప్పగిస్తున్నారు మోదీ. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌నీ సిద్ధం చేశారు. వంద రోజుల ప్రణాళికను రెడీ చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. 


Also Read: PM Modi: ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రెడీ, 100 రోజుల ప్లాన్ సిద్ధం చేయండి - మంత్రులకు మోదీ హితబోధ