PM Modi Japan Visit: వార్షిక జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా పర్యటనకు వెళ్లారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా వెళ్లారు. G7 సమావేశానికి హాజరయ్యే ముందు ఆయన ఇక్కడ ఫ్యూమియోతో సమావేశమై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని కూడా అందించారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించి, ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు జపాన్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయాలను మనమంతా పాటించి ముందుకు సాగాలని అన్నారు. ఇదే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అవుతుందన్నారు.
'అహింస ఆలోచనను మరింతగా పెంచుతుంది'
హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలోనే నాటారని తెలుసుకొని చాలా సంతోషించారు.
నేటికీ హిరోషిమా పేరు వింటేనే ప్రపంచం వణికిపోతుందని మోదీ అన్నారు. G7 సమావేశంలో అతను మొదట గౌరవనీయమైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. అయితే హిరోషిమా నేడు ప్రపంచం వాతావరణ మార్పులకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. వాతావరణ మార్పులతో యుద్ధంలో విజయం సాధించాలంటే పూజ్య బాపు ఆదర్శం అని అన్నారు. అతని జీవనశైలి ప్రకృతి పట్ల గౌరవం, సమన్వయం, అంకితభావానికి సరైన ఉదాహరణ అన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన భారతీయ ప్రజలను కూడా కలిశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో జరగనున్న G-7 సదస్సుకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన హిరోషిమా చేరుకున్నారు. మే 21 వరకూ అక్కడే సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని కీలక అంశాలు చర్చించనున్నారు. ఆహార భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో G-7 సదస్సుకి హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
"చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే సరిహద్దు వివాదం విషయంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. అదే సమయంలో తన గౌరవాన్ని కాపాడుకునేందుకూ ప్రాధాన్యతనిస్తుంది. ఇక పాక్ విషయానికొస్తే..ఆ దేశంతోనూ మేం శాంతినే కోరుకుంటున్నాం. వివాదాలన్నీ సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనాలనే ఆశిస్తున్నాం. అలా జరగాలంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలి. ఇది ఆ దేశ బాధ్యత"