Boss Modi :  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ..ఆస్ట్రేలియా ప్రధాని  ఆంథోనీ అల్బెనీస్  బాస్‌గా సంబోధించారు. సిడ్నీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన  ప్రసంగంలో ఆస్ట్రేలియా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.  ‘ఈ వేదికపై నేను చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను చూసినప్పుడు భారత ప్రధాని మోదీకి లభించిన స్వాగతం ఆయనకు లభించలేదు.. ప్రధాని మోదీయే బాస్’ అని వ్యాఖ్యానించారు.  ‘ది బాస్’‌అని పిలుచుకునే లెజెండరీ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో ఆన పోల్చారు.   మంచి క్రేజ్ ఉన్న ఆయన కన్నా ప్రధాని మోదీకే ఎక్కువ ఆదరణ ఉందని ఆస్ట్రేలియా ప్రధాని చెబుతున్నారు. అందుకే బాస్ అని అభివర్ణించారు.                             

  





 


ఈ సందర్భంగా మార్చిలో తన భారత పర్యటనను అల్బెనీస్ గుర్తుచేసుకున్నారు. ‘భారత్‌కు వెళ్లినప్పుడు గుజరాత్‌లో హోలీ జరుపుకోవడం, ఢిల్లీలో మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛం వేయడం మరచిపోలేని క్షణాలని ఆయన అన్నారు.  తాను ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన  ఏడాదిలోపే   ఆరుసార్లు మోదీతో భేటీ అయ్యానని గుర్తు చేసుకున్నారు.   ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఇదే తెలియజేస్తోందన్నారు.  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది.. ఇది ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశం.. ఇది హిందూ మహాసముద్రంలో మనకు ముఖ్యమైన పొరుగు దేశం.. అందుకే మనం పెట్టుబడి పెట్టాల్సిన సంబంధం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని పిలుపునిచ్చారు.                         


భారత్ కీలక వ్యూహాత్మక భాగస్వామి.. వారితో గొప్ప స్నేహం ఉంది.. ప్రపంచంలోని క్రికెట్‌ మైదానాల్లో వారితో స్నేహపూర్వకమైన క్రీడా పోటీ ఉంది.. త్వరలోనే మేము ఛాంపియన్‌షిప్‌లో మరోసారి పోటీ పడతామన్నారు.  భారత ప్రధాని మోదీ మాకు ఎప్పటికీ ఆత్మీయ అతిథి  అని అన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీకీ ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. సిడ్నీలో భారతీయులు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్యూడస్ బ్యాంక్ అరేనాలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ ప్రధానితో పాటు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బెనీస్ పాల్గొన్నారు.  


సిడ్నీ చేరుకున్న ప్రధాని మోదీకి భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రధాని మోడీ భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బలమైన రక్షణ మరియు భద్రతా సహకారం కోసం తన కోరికను వ్యక్తం చేశారు.. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. మోడీ రాకకు ముందు, ప్రధాని అల్బనీస్ ఆస్ట్రేలియాలో మోడీ అధికారిక పర్యటనకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.