PM Modi in Italy: ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సుకి హాజరయ్యేందుకు ఇటలీకి వెళ్లారు. అపులియాలో ఈ సదస్సు జరుగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటలీ చేరుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం వల్ల మరింత కీలకంగా మారింది. భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ మేరకు మోదీ ఓ ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. 


"G7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇటలీ వచ్చాను. ప్రపంచ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతర్జాతీయ సవాలు ఏదైనా సరే కలిసికట్టుగా అధిగమించగలం. మంచి భవిష్యత్‌ని అందించగలం"


- ప్రధాని నరేంద్ర మోదీ




బృందిసి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి భారత రాయబారి వాణిరావు ఆయనకు ఆహ్వానం అందించారు. అయితే...ఈ సదస్సులో మోదీ ప్రధానంగా AI టెక్నాలజీపై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో పాటు ఇంధన రంగంలోని సవాళ్ల గురించీ చర్చించనున్నారు. క్షణం తీరిక లేకుండా వరుస భేటీలతో బిజీగా ఉండనున్నారు మోదీ. ఈ మేరకు షెడ్యూల్ సిద్ధమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద, జర్మన్ ఛాన్స్‌లర్ ఒలఫ్ షోల్జ్‌తో పాటు ఇటలీ ప్రధాని జారియ మెలోనితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ భేటీ అయ్యే అవకాశముంది. ఇటలీకి వెళ్లడం తనకెంతో సంతోషంగా ఉందని స్పష్టం చేసిన మోదీ గతంలో జార్జియా మెలోని భారత్‌ పర్యటనకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య మైత్రి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.