జర్మనీలో జరగనున్న జీ7 సదస్సుకి ప్రధాని మోదీ


ప్రధాని మోదీ విదేశీ టూర్‌లో బిజీగా గడపనున్నారు. ఇప్పటికే జర్మనీ చేరుకున్న ఆయన రెండ్రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. 
జూన్ 28న యూఏఈ వెళ్లనున్నారు. జర్మనీలో జీ7 సమ్మిట్‌లో పాల్గొననున్నారు. పర్యావరణం, ఆహార భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్టు సమాచారం. జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇదే సదస్సుకు అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను ఆహ్వానించింది జర్మనీ. ఈ దేశాలతో భారత్‌ బంధం బలోపేతం చేసేందుకు ఈ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడనుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. గతేడాది మేలోనూ జర్మనీలో పర్యటించారు మోదీ. ఇండియా-జర్మనీ ఇంటర్‌గవర్నమెంటల్ కన్సల్టేషన్స్‌లో భాగంగా ఆరోసారి జర్మనీకి వెళ్లారు. 


జీ7 సదస్సు ముగిశాక జూన్ 28న యూఏఈ వెళ్లనున్నారు. మాజీ యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా మృతిపై సంతాపం ప్రకటించనున్నారు. 
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మహమ్మద్ బిన్ జాయేద్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైందుకు గానీ ఆయనకు అభినందనలు తెలపనున్నారు. జూన్ 28 రాత్రి యూఏఈ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. జీ7 సదస్సులో భాగంగా తన అభిప్రాయాలను, ఆలోచనలను ఆయా దేశాలతో పంచుకుంటానని, పర్యావరణ పరిస్థితులపై కీలకంగా చర్చిస్తానని ప్రధానమంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.