PM Modi Gets Grand Welcome In Tokyo: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్ చేరుకున్నారు.  హనేడా విమానాశ్రయంలో ఆయన ఘన  స్వాగతం  లభించింది. జపాన్ మహిళలు పవిత్ర గాయత్రీ మంత్రం, ఇతర  మంత్రాలను పఠిస్తూ భక్తిపూరిత వాతావరణంలో స్వాగతం పలికారు. జపాన్ కళాకారులు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలతో స్వాగతం పలికారు. 

Continues below advertisement


భారతీయ సంస్కృతికి జపానీ టచ్ ఇస్తూ సాంప్రదాయ భారతీయ చీరలు ధరించిన జపాన్ మహిళల బృందం ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికింది.  రాజస్థానీ శైలిలో “పధారో మ్హారే దేశ్” అంటే మా దేశానికి స్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించారు. ఆ బృందంతో సుహృద్భావంతో మాట్లాడారు. వారు ఎంత కాలం నుండి భాషను నేర్చుకుంటున్నారని తెలుసుకున్నారు. ఒక జపాన్ మహిళ తాను ఎనిమిది సంవత్సరాలుగా హిందీ నేర్చుకుంటున్నానని, అలాగే రాజస్థానీ ,  గుజరాతీ భజనలను కూడా నేర్చుకుంటున్నానని తెలిపింది.





 
ప్రధానమంత్రి ఆ మహిళను ఒక భజన పాడమని కోరారు. ఆమె ప్రసిద్ధ రాజస్థానీ భజన “మై వారీ జావు రే”ని ఆలపించింది. మోడీ వారి ప్రయత్నాలను మెచ్చుకుని, భారతీయ భాష ,  సంస్కృతి పట్ల వారి అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ స్వాగతానికి ప్రధానమంత్రి మోదీ సంతోషపడ్డారు.  తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక  భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకున్నారు. “జపాన్‌లో ప్రత్యేక స్వాగతం” అని ఆ పోస్ట్‌లో  ప్రత్యేకంగా రాశారు.


జపాన్‌కు బయలుదేరే ముందు, ప్రధానమంత్రి మోడీ ఈ సందర్శన భారత్,   జపాన్‌లను శతాబ్దాలుగా అనుసంధానించిన నాగరిక ,సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత టోక్యోలో జరిగిన  బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి జపాన్ ప్రధాన మంత్రి ఇషిబా హాజరయ్యారు. జపాన్‌తో భారతదేశం యొక్క లోతైన ఆర్థిక సంబంధాల గురించి ,  రాబోయే సంవత్సరాల్లో సహకారం మరింతగా పెరగగల రంగాలను లిస్టవుట్ చేశారు.  ఆటోమొబైల్స్‌లో మనం పరస్పర సహకారంతో ముందడుగు వేసినట్లుగానే   బ్యాటరీలు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్, అణుశక్తిలో కూడా అదే  సహకారం కొనసాగాలని ప్రదాని మోదీ కాంక్షించారు.