Morbi Bridge Tragedy: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బనస్కాంతలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీగల వంతెన ప్రమాదం దేశం ఇటీవల చూసిన అతిపెద్ద విపత్తులలో ఒకటిగా పేర్కొన్నారు.
అంతకుముందు
ఈ ఘటనపై సోమవారం ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కెవాడియాలో జరిగిన సభలో మాట్లాడుతూ సంతాపం ప్రకటించారు.
" ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోంది. నేను ఏక్తా నగర్‌లో ఉన్నాను కానీ నా మనసు మాత్రం మోర్బీ బాధితులతోనే ఉంది. నా జీవితంలో చాలా అరుదుగా నేను ఇలాంటి బాధను అనుభవించి ఉంటాను. "
మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.
ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.