తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనరేట్ లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కి ప్రత్యేక స్థానం దక్కింది. ఉత్తమమైన పని తీరు కనబరిచి పెట్రో కార్, బ్లూ కోల్ట్స్, ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాల్లో మొత్తంగా 12లో మొదటి స్థానాన్ని దక్కించుకొని రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ సింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.


ఎంపిక జరుగుతుంది ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల పనితీరుకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎంపికకి సంబంధించిన విధానంలో పలు విభాగాల్లో కరీంనగర్ పోలీసులు తమదైన ప్రతిభ కనబరిచారు.  బ్లూ కోల్ట్స్ మొదలుకొని కమ్యూనిటీ పోలీసింగ్ వరకు మొత్తం 18 విభాగాలను ఏర్పాటు చేయగా వీటన్నింటినీ పరిశీలించడానికి "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" అనే ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషనరేట్లలో పోలీసుల పనితీరుపై సమీక్షిస్తూ ఉత్తమమైన జిల్లాలను.. విభాగాల వారీగా కమిషనరేట్ ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే అత్యున్నత టెక్నాలజీ వాడుతూ ప్రజలకు చేరువైన కరీంనగర్ కమిషనరేట్ మొత్తం 12 విభాగాల్లో మెరుగైన పాయింట్లు సాధించి మొదటి స్థానం దక్కించుకుంది.


గత కాలం నాటి పోలీసింగ్ నుండి ఎంతో మార్పు


గతంలో పోలీసులంటేనే భయపడే పరిస్థితి నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్ కి నాంది పలికి ప్రజలకు భరోసాని అందిస్తున్నారు. మరోవైపు కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో విశ్వాసం చూరగొంది. నేరాలను ముందుగానే అరికట్టే విధంగా ప్రజలతోపాటు పని చేస్తోంది. వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకుగాను సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యవహరిస్తోంది.


తక్షణ రక్షణ వ్యవస్థ బ్లూ కోల్ట్స్
ఇక ద్విచక్ర వాహనాలతో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించే బ్లూ కోర్స్ వ్యవస్థ పనితీరుకు కూడా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఎక్కడైనా సరే క్షణాల్లో వెళ్లి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా నేర నిర్ధారణ చేయడంతో పాటు వెనువెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తోబాటు ఇతర అత్యవసర సేవల విభాగాలకు సైతం సమాచారం అందించే విధంగా ఏర్పాటు చేసిన బ్లూ కోల్ట్స్ వ్యవస్థ కరీంనగర్ కమిషనరేట్ లో విజయవంతంగా నడుస్తోంది. జరగబోయే నేరాన్ని నివారించడంలోనూ ఈ వ్యవస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఇక మహిళలు యువతుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీం వ్యవస్థ సైతం ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని వాడుతూ శాంతిభద్రతలను కాపాడుతోంది.


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోను కరీంనగర్ పోలీసులు అనేక సంస్కరణలను తీసుకువచ్చి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ స్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు నెరిపే విధంగా ఉన్నతాధికారులు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంతో అప్పట్లో తీవ్రంగా ఉన్న మావోయిస్టు సమస్య సైతం దాదాపుగా కనుమరుగైపోయింది. ఉత్తమ ఫలితాలు కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన కరీంనగర్ కమిషనరేట్ సిబ్బందిని సీపీ సత్యనారాయణ అభినందించారు. భవిష్యత్తులోనూ కమిషనరేట్ నుండి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామని తెలిపారు.