PM Modi Congratulates Keir Starmer: యూకే ఎన్నికల్లో ఘన విజయం (UK Election Results 2024) సాధించిన సందర్భంగా కీర్ స్టార్మర్‌కి కంగ్రాట్స్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే స్టార్మర్ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆయనకు అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. భారత్, యూకే మధ్య సత్సంబంధాలు కొనసాగించేలా చొరవ చూపిస్తారని ఆశిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు.
"ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కీర్ స్టార్మర్‌కి ప్రత్యేక అభినందనలు. మీ హయాంలో భారత్ యూకే మధ్య మైత్రి బలపడాలని ఆకాంక్షిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ సహకరించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కలిసి నడుస్తారని భావిస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కచ్చితంగా గెలుస్తానని ధీమాగా ప్రచారం చేసుకున్న సునాక్‌కి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ రిషి సునాక్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో ఇన్నాళ్లూ మైత్రి కొనసాగించినందుకు థాంక్స్ చెప్పారు. భారత్ యూకే మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందని అన్నారు.
"యూకేకి గొప్ప పాలన అందించినందుకు రిషి సునాక్‌కి అభినందనలు తెలుపుతున్నాను. మీ చొరవ వల్లే భారత్ యూకే మధ్య ద్వైపాక్షిక బంధం బలపడింది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆల్ ది బెస్ట్"
- ప్రధాని నరేంద్ర మోదీ
దాదాపు దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైంది లేబర్ పార్టీ. 14 ఏళ్లుగా యూకేని కన్జర్వేటివ్ పార్టీయే ఏలుతోంది. ఇన్నాళ్లకు లేబర్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 326 సీట్ల మేజిక్ ఫిగర్‌ని దాటింది. త్వరలోనే కీర్ స్టార్మర్ ప్రధాని బాధ్యతలు తీసుకోనున్నారు. రిషి సునాక్ ఈ ఫలితాలపై స్పందించారు. ఓటర్లందరికీ సారీ చెప్పారు. ఇప్పటి వరకూ తనకు మద్దతునిచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు థాంక్స్ చెప్పారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.