Best Horror Movies On OTT: కేవలం హాలీవుడ్‌లోనే కాదు.. మరెన్నో ఫారిన్ భాషల్లో కూడా భయంకరమైన హారర్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. కానీ అవి ఇంగ్లీష్‌లో డబ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువమందికి ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. అలా ఇండోనేషియర్ హార్ మూవీ ఒకటి.. తాజాగా ఇంగ్లీష్‌లోకి డబ్ అయ్యి ఓటీటీలో విడుదలయ్యింది. ఓటీటీలో విడుదలయిన తర్వాత ఈ మూవీని చూసిన చాలావరకు ప్రేక్షకులు దీని గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ఇది అసలైన హారర్ సినిమా అని అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది?
శవాలను శుభ్రం చేసే పని..
‘పెమండి జెనాజా’ అనేది ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ. ఆ భాషలో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఇంగ్లీష్‌లో ‘కార్ప్స్ వాషర్’ పేరుతో డబ్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ హారర్ సీన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ మూవీ. ఇక టైటిల్‌లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ లేలా (అఘ్నిని హాక్), సితీ (డెనార్ మెసా ఆయు).. కార్ప్స్ వాషర్స్‌గా పనిచేస్తుంటారు. అసలు ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఈ మూవీ చూసేవరకు చాలామందికి తెలియదు. కార్ప్స్ వాషర్స్ అంటే శవాలను కడిగేవారు. ఏ పరిస్థితిలో చనిపోయిన శవాలను అయినా శుభ్రం చేసి వారి కుటుంబాలకు అప్పగిస్తారు లేలా, సితీ. చివరికి ఆ వృత్తే వారికి ప్రమాదంగా మారుతుంది.
శవం చేతిలో చావు..
శవాలతో సావాసం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సితీ కుటుంబం ఎప్పటినుండో ఇదే వృత్తిలో ఉంది కాబట్టి తను కార్ప్స్ వాషర్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకుంది. ఇక తన కూతురు లేలాను కూడా కార్ప్స్ వాషర్‌గా తయారు చేసింది. శవాలను శుభ్రం చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు అవి కళ్లు తెరిచి చూసినట్టుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ సితీ, లేలా దానిని పెద్దగా పట్టించుకోకుండా వారి పని పూర్తి చేస్తుంటారు. ఈ వృత్తిలో ఉండడం వల్ల వారికి దెయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటికి కూడా వాళ్లిద్దరూ భయపడరు. కానీ ఒకరోజు ఒక శవం.. సితీపై దాడిచేస్తుంది. ఆ సమయంలో లేలా తన పక్కన ఉండదు. దీంతో సితీ.. ఆ శవం చేతిలో చనిపోతుంది.
మహిళల మరణాలు..
తల్లి చనిపోయిన తర్వాత లేలా ఒంటరి అయిపోతుంది. సితీ తర్వాత అదే కాలనీలో జీవిస్తున్న పలువురు మహిళలు అనుమానస్పద స్థితిలో మరణించి ఉంటారు. వారందరికీ లేలానే కార్ప్స్ వాషర్‌గా పనిచేస్తుంది. కానీ అందరి మరణాల వెనుక మరో మహిళ ఉందేమో అని లేలాకు అనుమానం వస్తుంది. ఇంతకు ఎవరు ఆ మహిళ? ఆ ఏరియాలో మహిళలు అందరూ ఎందుకలా చనిపోతున్నారు? వీటికి కారణాలను లేలా కనుక్కోగలదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘కార్ప్స్ వాషర్’ మూవీ చూడాల్సిందే. భయంకరమైన హారర్ సీన్స్ ఉండడం వల్ల ఇది చిన్నపిల్లలు చూడడం మంచిది కాదని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.