Ram Mandir Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షని విరమించారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12వ తేదీన ప్రకటించారు మోదీ. అప్పటి నుంచి అదే నిష్ఠను కొనసాగిస్తున్నారు. ఇవాళ (జనవరి 22) ప్రాణ ప్రతిష్ఠ ముగిసింది. ఆ తరవాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ సమయంలోనే తీర్థం తీసుకుని తన కఠిన దీక్షని విరమించారు. గోవింద్ దేవ్‌ గిరి మహరాజ్‌ చేతుల మీదుగా ఆయన తీర్థం తీసుకున్నారు. దీన్ని చరణామృత్‌గా పిలుస్తారు. పాలతో తయారు చేసిన ఈ తీర్థాన్ని పూజాక్రతువులో వినియోగిస్తారు. ఇదే తీర్థాన్ని ప్రధాని మోదీకి ఇచ్చి దీక్ష విరమింపజేశారు దేవ్‌ గిరి మహరాజ్. ఈ సమయంలో ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. 11 రోజుల పాటు కఠిన దీక్షని దిగ్విజయంగా పూర్తి చేశారని కొనియాడారు.


ఈ 11 రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. అంతే కాదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...రోజూ గంట 11 నిముషాల పాటు ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠించారు. కొంత మంది ఆధ్యాత్మిక గురువుల ఉపదేశం మేరకు ఈ మంత్రాన్ని ఆయన రోజూ జపించారు. ఇలాంటి దీక్ష చేసే సమయంలో ఈ మంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమని, అది ఎంతో శక్తిమంతమైనదనీ తెలుస్తోంది. కొన్ని పవిత్ర గ్రంథాలనూ పఠించారు. కొన్ని కఠినమైన నిబంధనలు పాటించారు. చాలా నిష్ఠగా ఉన్నారు. నేలపైనే నిద్రించారు. రోజూ గోపూజ చేయడంతో పాటు దానాలు చేశారు. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేశారు. షెడ్యూల్‌ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ నిష్ఠను కచ్చితంగా అనుసరిస్తానని ప్రధాని మోదీ తన సన్నిహితులతో చెప్పారు. 






ఈ దీక్షలో భాగంగానే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించారు ప్రధాని. నాసిక్‌లోని శ్రీ కాలారామ్‌ ఆలయం, లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం, గురవాయర్, కేరళలోని శ్రీ రామస్వామి ఆలయంతో పాటు తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను సందర్శించారు. అంతకు ముందు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వాయిస్‌ మెసేజ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన (Ayodhya News) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదంతా ఆ దైవ సంకల్పమే అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఉప్పొంగిపోయే సందర్భమని అన్నారు. ప్రతి చోటా రాముడే కనిపిస్తున్నాడని చెప్పారు. 


Also Read: Ram Mandir: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం