President Murmu letter To PM Modi: యావత్ భారతదేశం మొత్తం నేడు రామనామ స్మరణతో మార్మోగుతోంది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది హిందువుల కల నెరవేర సమయం ఆసన్నమైంది. ప్రపంచం నలు మూలల ఉన్న భారతీయవులు, హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న శుభ తరుణాన్ని పురస్కరించుకొని దేశమంతా రామ నామంతో మార్మోగుతోంది. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయంలో ప్రతి మూల,  దీపాలు, పూలతో సర్వాంగసుందరంగా అలంకరించబడ్డాయి. 
 
అయోధ్య వేడుకల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు అయోధ్య బాట పడుతున్నారు. ఈ మహోన్నత క్రతువు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ప్రధాని మోదీకి ఓ లేఖను రాశారు. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఈ లేఖను రాశారు. లేఖను ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో పోస్ట్ చేశారు.  


ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కొలకొందని, ఇది భారతదేశం ఆత్మను ప్రతిబింభిస్తుందని లేఖలో పేర్కొన్నారు. శ్రీ రాముడు అందించిన ధైర్యం, ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. 


రాష్ట్రపతి లేఖలో పేర్కొంటూ మనుషుల సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమ, గౌరవంతో చూడాలని ప్రభు శ్రీరామ గొప్ప సందేశాన్ని అందించారని పేర్కొన్నారు. న్యాయ పరిపాలన, ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, ఇది ప్రస్తుతం మన దేశ పరిపాలనలో కనిపిస్తోందని రాష్ట్రపతి ముర్ము అభిప్రాయపడ్డారు. అలాగే నరేంద్ర మోదీ చేపట్టిన అనుష్టానం గురించి ప్రస్తావించారు. ప్రధాని చేపట్టిన 11 రోజుల అనుష్ఠానం ఒక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదని, శ్రీరామునికి త్యాగం, సమర్పణకు ప్రతీక అని రాష్ట్రపతి లేఖలో పేర్కొన్నారు.


కోట్లాది మంది ప్రజల జీవితాల్లో రాముడి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. రాముడు భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం. ఆయన చేసిన పనులు ఆదర్శప్రాయం అంటూ చెడుపై మంచి నిత్యం యుద్ధం చేస్తుందని, విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అలాగే చీకటిలో ఉన్నప్పుడు రామ నామం వెలుగు చూపిందని, ఆ నామం తనను రక్షించిందని, ఇప్పటికీ తనను కాపాడుతోందని రాముడి గురించి మహాత్మా గాంధీ చెప్పిన అంశాలను ఆమె ఉటంకించారు.


అయోధ్యలో రామమందిర మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా అతిథులు,  విదేశీ ప్రముఖులు అయోధ్యకు చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి జీవితం, ఆలయ ప్రాణ ప్రతిష్టను జరుపుకునేలా వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి.