Ayodhya Ram Mandir Art With Millets In Visakha: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశమంతటా రామ నామ జపం వినిపిస్తోంది. విభిన్న రూపాల్లో రామయ్య ను తీర్చేదిద్దుతున్న వారి సంఖ్య పెరిగింది. దేశ ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరుగుతున్నటైంలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌ కుమార్‌ ఒక ప్రత్యేకమైన అంశంతో అయోధ్య రామమందిరం, శ్రీరామచండ్రుడి చిత్రాన్ని తీర్చిదిద్దారు. విజయ కుమార్ తీర్చిదిద్దిన ఈ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భక్తులు అచ్చేరువొందేలా ఉన్నాయి. 


చిరుధాన్యాలతో చిత్రాలు..


సాధారణంగా చిత్రకారులు కుంచె చేతబట్టి తమలోని ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ చిత్రాలను గీస్తుంటారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ మాత్రం విభిన్నమైన రీతిలో చిత్రాలు గీస్తూ తనలోని ప్రావీణ్యాన్ని బయటపెడుతున్నారు. ఆహారంగా వినియోగించే చిరు ధ్యానాలను(మిల్లెట్స్‌) వినియోగించి విభిన్నమైన చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు వందలాది చిత్రాలను గీచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయకుమార్.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో మిల్లెట్స్ తో రామాలయాన్ని, రాముడు చిత్రాన్ని తీర్చిదిద్ది అదరహో అనిపించారు. వారం రోజులుగా దాదాపు నిత్యం ఎనిమిది గంటలకుపైగా శ్రమించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయోధ్యలోని రామమందిరం నమూనా, శ్రీరామ చంద్రుని రూపాలను ఒకే చిత్రంలో తీర్చిదిద్దారు విజయ్ కుమార్. సహజత్వం ఉట్టిపడే విధంగా ఈ చిత్రాన్ని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. 2023ని ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనిని పురస్కరించుకుని ప్రజల్లో సిరి ధాన్యాలపట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో విజయ్‌ కుమార్‌ ఈ పని చేస్తున్నారు. సామాజిక సందేశాన్ని కళకు జోడిస్తూ వివిధ ఉత్సవాలు, పండుగలు, ప్రత్యేక రోజులను ప్రతిబింబిస్తూ అనేక చిత్రాలను చిరుధాన్యాలతో తీర్చిదిద్ది ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


ప్రపంచం మెచ్చిన చిత్రకారుడు..


మోకా విజయ్ కుమార్ రూపొందించిన అనేక చిత్రాలు ప్రపంచంలోని అనేక రంగాలకు చెందిన ప్రముఖుల మన్ననలను అందుకున్నాయి. ఇటీవల విశాఖపట్నం, హైదరాబాద్‌, న్యూ ఢిల్లీ నగరాలలో జరిగిన జి`20 సదస్సుల్లో సైతం విజయ్ కుమార్ తయారు చేసిన చిరుధాన్యాల చిత్రాలను ప్రదర్శించి, రాష్ట్ర, జాతీయ స్తాయిలో ప్రముఖుల, నేతల ప్రశంసలు అందుకున్నారు. విజయ్ కుమార్ ఇప్పటి వరకు తీర్చిదిద్దిన చిత్రాల జాబితాలో రాజకీయ సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు.