Modi Ayodhya Visit:
మోదీ పర్యటన..
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటనకు అంతా సిద్ధమైంది. రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా అయోధ్యను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. పలు చోట్ల పూలతో అలంకరించారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అటు భద్రతనూ కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామ మందిర వేడుకలు మరి కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇక్కడికి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని అయోధ్య రైల్వే స్టేషన్‌తో పాటు ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభిస్తారు. ఆ తరవాత ఓ ర్యాలీలో పాల్గొంటారు.
అయోధ్య రైల్వే స్టేషన్‌లో చాలా మార్పులు చేసి పూర్తిగా రెనోవేట్ చేశారు. కొత్త హంగులు అద్దారు. ఈ స్టేషన్‌నే ప్రారంభిస్తారు మోదీ. ఆ తరవాత అయోధ్య ధామ్ ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభిస్తారు. మోదీకి ఆహ్వానం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. "పవిత్రమైన అయోధ్య నగరానికి స్వాగతం" అంటూ చాలా చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాముడి నగరానికి స్వాగతం అంటూ మరి కొన్ని చోట్ల బ్యానర్లు వెలిశాయి. ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతను రెట్టింపు చేశారు. మొత్తంగా నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకూ ఉన్న మార్గానికి రామ్ పథ్‌గా నామకరణం చేశారు. ఈ దారిలో దాదాపు 40 చోట్ల 1,400 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. అయోధ్య రైల్వే స్టేషన్‌ని 11.15 నిముషాలకు ప్రారంభిస్తారు. అదే సమయంలో అమృత్ భారత్ ట్రైన్స్‌తో పాటు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపుతారు. 12.15 నిముషాలకు అయోధ్య ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు రూ.15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.