PM Modi: 'వెయిట్ చేయొద్దు, వెంబడించండి'- ఉగ్రవాదులకు మోదీ మాస్ వార్నింగ్

ABP Desam   |  Murali Krishna   |  18 Nov 2022 11:52 AM (IST)

PM Modi: ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉంటుందన్నారు.

(Image Source: ANI)

PM Modi: దిల్లీలో జరిగిన 'నో మనీ ఫర్ టెర్రర్' సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద దాడులకు అంతే తీవ్రంగా సమాధానం ఇవ్వాలని మోదీ అన్నారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలన్నారు.

ఉగ్రవాద సంస్థలకు అనేక వనరుల ద్వారా డబ్బు లభిస్తుందని అందరికీ తెలుసు. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. అవి వారికి రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఆ అండ చూసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మన ఇంటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ మా ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. -                                                  ప్రధాని నరేంద్ర మోదీ

రెండు రోజుల పాటు జరిగే ఈ 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఏ) సభ్యులు, పలు ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు కలిపి దాదాపు 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 

Also Read: Twitter Resignations: కొంపముంచిన మస్క్ అల్టిమేటం- వందల మంది ఉద్యోగులు రిజైన్!

Published at: 18 Nov 2022 11:46 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.