Twitter Resignations: ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ట్విట్టర్ సంస్థ నుంచి వందల మంది ఉద్యోగులు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. టెస్లా తరహా వర్కింగ్ స్టైల్‌ను ట్విట్టర్‌లో ప్రవేశపెట్టిన మస్క్.. ఉద్యోగులు ఎక్కవ సమయం పని చేయాలని లేదా సంస్థను వీడాలని అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
అల్టిమేటం
గురువారం సాయంత్రంలోగా అల్టిమేటమ్‌కు కట్టుబడి ఉండని ఏ ఉద్యోగికైనా మూడు నెలల సెవెరెన్స్ (ఉద్యోగం నుంచి తీసెసే నోటీసు) అందుతుందని మస్క్ ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు CNN న్యూస్ తెలిపింది.
రిజైన్
ఈ మెయిల్ చూసిన తర్వాత ఉద్యోగులు చర్చించుకుని చాలా మంది రిజైన్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డజన్ల కొద్దీ ఉద్యోగులు వీడ్కోలు సందేశాలతో పాటుగా గ్రూప్‌లో సెల్యూట్ ఎమోజీలు (మీ సేవకు ధన్యవాదాలు) పెడుతున్నారని తెలిసింది. అయితే ఇప్పటివరకు ఎంత మంది ఉద్యోగులు రాజీనామా చేశారనేది స్పష్టంగా తెలియలేదు.
పని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, లేదంటే ఉద్యోగులు సంస్థను వీడాలని మస్క్ వార్నింగ్ ఇవ్వడం ఉద్యోగులను హర్ట్ చేసిందని నివేదిక తెలిపింది. ఒకవేళ సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నారు.
షాకింగ్ నిర్ణయాలు
ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే చాలా మంది ఉద్యోగులను తీసేసిన మస్క్.. లేఆఫ్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఔట్‌సోర్సింగ్ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
నోటీసులు లేకుండా!
అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు కొనసాగినట్లు సమాచారం. ట్విట్టర్‌కు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. అయితే వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశారట.
కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.