PM Kisan Samman Nidhi: దేశంలో ఉన్న రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద చాలా మంది రైతులు లబ్ధి పొందడం లేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సాగుభూమి ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ కింద ఏటా 6 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న కేంద్రం.. ఈ కేవైసీ నిబంధనలు పెట్టడంతో వేలాది మంది రైతులు ఈ పథకానికి అర్హత కోల్పోతున్నారు. ఈ పథకానికి అర్హత పొందేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఏటా జనవరిలో మూడో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న కేంద్రం ఈ కేవైసీ పూర్తి కాలేదన్న నెపంతో చెల్లింపులు జరపడం లేదు. రైతుల ఈ కేవైసీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను నియమించింది. అయితే ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ, ఈ కేవైసీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. 


ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పటికే మూడుసార్లు గడువును పొడిగించారు. తాజాగా ఈనెల 15వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. అయినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కాలేది సమాచారం. ఈ కేవైసీ పూర్తి కాకపోతే పీఎం కిసాన్ సమ్ము రైతుల ఖాతాల్లో పడదని కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పీఎం కిసాన్ 13వ విడతకు అర్హులైన రైతుల ఖాతాల్లో మార్చి 8వ తేదీ హోలి పండుగనాడు డబ్బులు జ మ చేయనున్నట్లు సమాచారం. అయితే పీఎం కిసాన్ పథకం కోసం రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కేంద్రం 12 విడతలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. మొదట్లో 50 లక్షల మందికి పైగా లబ్ధి పొందగా ఆ తర్వాత ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. 


ఏపిలో 60,77,808 మంది పథకానికి నమోదు చేసుకోగా 2022-23లో  ఏప్రిల్‌-జులై  మాసాలకు 46,62,768 మందికి జమ పడింది.  ఆగస్టు-నవంబర్‌ కు 27,55,285 మందికే ఇప్పటి వరకు జమ పడింది. రిజిస్టరైన వారిలో సుమారు 33 లక్షల మందికి పడలేదు. ముందటి కిస్తు పడ్డ వారిలో 19 లక్షల మందికి కోత పడింది. అంతకు ముందు లబ్ధిదారుల్లో 20 లక్షల మంది తగ్గారు. ఇంత భారీగా ఎందుకు తగ్గుతారన్నదానిపై స్పష్టత లేదు.  ఏపీలో కావాలేన తగ్గిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 


రైతు భరోసా నిధులు కూడా అవే.. రైతులకు ఇబ్బందులు ! 


రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వ్యవసాయదారులకు రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తోంది. రెండు పథకాలకూ కలిపి లబ్ధిదారులను రాష్ట్రమే నిర్ణయిస్తోంది. ఏడాదిలో రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.13,500 అందాలి. మేలో ఇచ్చే తొలి కిస్తు రూ.7,500లో రాష్ట్రం 5,500, కేంద్రం 2,000 ఇవ్వాలి. నవంబర్‌లో ఇచ్చే రెండవ కిస్తులో రాష్ట్రం 2 వేలు, కేంద్రం 2 వేలు ఇవ్వాలి. మూడవ కిస్తు 2 వేలనూ కేంద్రమే ఇస్తుంది. అందులో రాష్ట్ర వాటా లేదు.  భూమి యజమానులకు రాష్ట్రం ఇచ్చే సాయం పడుతోంది తప్ప కేంద్రం ఇచ్చేది సకాలంలో పడట్లేదు. లక్షలాది మంది రైతులు కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అయినా జమ చేస్తుందా అంటే..  అదీ చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.