Plane crashed near Ahmedabad airport: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పైకి లేచిన వెంటనే సమీపంలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలినట్లు తెలుస్తోంది. విమానంలో 242 మంది ప్రయాణీకులు ఉన్నట్లు అంచనా. ఖచ్చితమైన సంఖ్య ఇంకా స్పష్టత లేదు.
విమానం క్రాష్ సైట్ నుండి దట్టమైన నల్లని పొగలు లేచాయి, స్థానిక నివాసులు భారీ శబ్దం విన్నట్లు, ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు తెలిపారు. అగ్నిమాపక దళం, అత్యవసర సహాయ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు విమానం బౌండరీ వాల్‌ను ఢీకొన్నట్లు సూచిస్తున్నాయి, మరికొన్ని టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యలను పేర్కొంటున్నాయి.
విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్ లతో పాటు సహాయ కార్యక్రమాల కోసం .. సిబ్బందిని తరలించారు. ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమయింది. ఆస్పత్రులన్నింటినీ సిద్ధంగా ఉంచాలని.. గాయపడిన ప్రయామికులు ఎవరైనా ఉంటే అత్యవసరంగా వైద్య సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
క్రాష్ అయిన విమానం అంతర్జాతీయ విమాన సర్వీసు కావడంతో విదేశీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రయాణికులు ఎవరు.. ఏ ఏ దేశాలకు చెందిన వారు అన్నది ప్రకటించలేదు. ప్రస్తుతానికి అధికార వర్గాలన్నీ సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. కాసేపటికి హెల్ప్ లైన్ తో పాటు ప్రయామికుల వివరాలు.. వారు ఏ దేశానికి చెందిన వారు అన్న వివరాలను తెలిపే అవకాశం ఉంది.
భారత్ లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లోఇది ఒకటి అయ్యే అవకాశం ఉందని ఏవియేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.