Nikhil Reaction About The Indian House Movie Shooting Set Accident: 'ది ఇండియన్ హౌస్' మూవీ షూటింగ్ సెట్‌లో భారీ ప్రమాదం జరిగి అసిస్టెంట్ కెమెరామెన్ సహా పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హీరో నిఖిల్ తాజాగా స్పందించారు. తాము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని తెలిపారు.

'వి ఆర్ సేఫ్'

ఈ ఘటనలో తామంతూ సేఫ్‌గా ఉన్నట్లు హీరో నిఖిల్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'మేమంతా సురక్షితంగా ఉన్నాం. ఆడియన్స్‌కు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే తపనతో కొన్నిసార్లు మేము రిస్క్‌లు తీసుకుంటాం. సిబ్బంది తీసుకున్న జాగ్రత్త, హెచ్చరికలతో ఈ రోజు మేము ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఈ ప్రమాదంలో భారీ, ఖరీదైన ఎక్విప్‌మెంట్ ధ్వంసమైంది. దేవుని దయ వల్ల ఎవరికీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు.' అంటూ రాసుకొచ్చారు.

Also Read: ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు టాలీవుడ్ పెద్దలు... పవన్ ఎఫెక్ట్... బాలకృష్ణను సంప్రదించి లిస్ట్?

అసలేం జరిగిందంటే?

నిఖిల్ లేటెస్ట్ మూవీ 'ది ఇండియన్ హౌస్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సాగుతోంది. సినిమాలో సముద్ర సన్నివేశాల కోసం ఓ భారీ సెట్‌ను శంషాబాద్‌లో వేయగా అక్కడ భారీ వాటర్ ట్యాంకర్ పగిలిపోయింది. దీంతో నీరు వరదలా ఆ సెట్‌ను ముంచెత్తింది. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ కెమెరామెన్ సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఈ ఘటన జరగ్గా సెట్‌ను నీరు ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఎవరికీ పెను ప్రమాదం జరగలేదని తాజాగా హీరో నిఖిల్ స్పందించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'నిఖిల్' ఈసారి కూడా మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ఆయనకు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. 1905 నాటి విప్లవం, లవ్ ప్రధానాంశాలుగా నిఖిల్ లేటెస్ట్ మూవీ 'ది ఇండియన్ హౌస్' తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 'హ్యాపీడేస్'తో తన కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. కార్తికేయ, కార్తికేయ 2 వంటి భారీ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.