Kerala Landslides: వయనాడ్‌లో విపత్తు ముంచుకొస్తుందని వారం రోజుల ముందే హెచ్చరించామని అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. కేరళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. వాతావరణ మార్పులను అసలు ఊహించలేమని తేల్చి చెప్పారు. గతంలో ఈ స్థాయిలో వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని, వాతావరణ మార్పులను కట్టడి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వెల్లడించారు. ఇలాంటిదేదో జరగగానే రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పంతా నెట్టేయడం సరికాదని అమిత్‌షాపై ఫైర్ అయ్యారు పినరయి విజయన్. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడొద్దంటూ చురకలు అంటించారు.
"వాతావరణ మార్పులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేమన్నది కేంద్ర ప్రభుత్వం ఓసారి ఆలోచించాలి. గతంలో ఎప్పుడైనా ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం చూశామా..? కానీ ఇప్పుడు అది జరుగుతోంది కదా. అందుకే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే విధంగా ఏవైనా చర్యలు చేపట్టాలి. విపత్తు రాగానే మాపైన తప్పు నెట్టేస్తారా. మీ బాధ్యత నుంచి తప్పించుకుంటారా. ఇది తప్పులు ఎంచాల్సిన సమయం కాదు"
- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
ఏదైనా విపత్తు సంభవిస్తుందనుకుంటే వారం రోజుల ముందే హెచ్చరించే వ్యవస్థ భారత్ వద్ద ఉందని అమిత్ షా వెల్లడించారు. ఈ టెక్నాలజీ ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉందని వివరించారు. దీనిపైనా పినరయి విజయన్ స్పందించారు. వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించారని, కానీ తరవాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని తేల్చి చెప్పారు. కొండచరియలు విరిగి పడిన రోజు కూడా కేంద్రం కేవలం ఆరెంజ్ అలెర్ట్ మాత్రమే ఇచ్చిందని వివరించారు. ముందే తెలిసుంటే రెడ్ అలెర్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ ప్రమాదం జరిగాక అప్పుడు రెడ్ అలెర్ట్ ఇచ్చారని చెప్పారు. ఇదే సమయంలో రెస్క్యూ ఆపరేషన్ గురించీ వివరించారు. ఇప్పటి వరకూ 144 మంది మృతదేహాలను గుర్తించినట్టు వెల్లడించారు. 191 మంది గల్లంతైనట్టు తెలిపారు.
Also Read: Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!