KTR :   తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాక్యలు చేశారు.  డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క భ‌విష్య‌త్‌లో  సీఎం కుర్చీలోకి వెళ్లాలని  మ‌నసారా కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఆ అర్హ‌త ఉందని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు గ‌త‌ ప‌దేండ్ల‌లో ఏం మంచి జ‌రిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి కేసీఆర్ ఫోబియా ప‌ట్టుకుందన్నారు.  ప‌దేళ్ల  త‌ర్వాత తెలంగాణ గురించి ప్ర‌స్తావించే సంద‌ర్భంలో ముందు ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా మ‌న‌నం చేసుకోవాలని..  గత ప్ర‌భుత్వం.. గ‌తం గ‌తం అంటూ పురావ‌స్తు శాఖ త‌వ్విన‌ట్టు త‌వ్వుతూనే ఉన్నారు అధికారం పార్టీపై మండిపడ్డారు. 


మాకు కూడా త‌ప్ప‌దు మేం కూడా త‌వ్వాలి.  మాట్లాడితే కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను చెరిపేస్తామ‌ని అంటున్నారని.. చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు. ఎలా చెడిపేస్తారు కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను అని ప్ర‌శ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.  కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్.. కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.. భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్.. పాలమూరు జలధారల్లో కేసీఆర్.. సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్.. గురుకుల బ‌డిలో కేసీఆర్ ఉంటారన్నారు.  యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్.. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్.. మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్.. కలెక్టరేట్ భ‌వ‌నాల‌ కాంతుల్లో కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్.. మీరు కూర్చున్న సచివాలయపు సౌధ రాజసంలో కేసీఆర్.. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ సృజనలో కేసీఆర్.. వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్.. ప్ర‌పంచంలోని అతి పెద్ద అంబేద్క‌ర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్.. అమర దీపం ఆశయల్లో కేసీఆర్.. అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 


చర్చ సమయంలో  కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది.  బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ..  కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ.. మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ అన్నారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని విమర్శించారు.   సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని తెలిపారు. 


ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా రాజకీయ అంశాలు చర్చకు రావడంతో చర్చ పక్క దారి పట్టింది.  రెండు సార్లు సభ వాయిదా పడిన తర్వాత ...మళ్లీ చర్చ జరగలేదు.