Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం (Chhattisgarh Truck Accident) జరిగింది. కబీర్‌ధామ్‌లో ట్రక్‌ లోయలో పడిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ముగ్గురు మైనర్‌లున్నారు. పికప్ ట్రక్‌లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అదుపు తప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రోజువారీ కూలీలో భాగంగా అడవికి వెళ్లి వస్తున్న కార్మికులు అనుకోకుండా ఇలా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రమాద స్థలానికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. స్ఫాట్‌లోనే 12 మంది మహిళలతో పాటు ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. మిగతా వాళ్లు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్‌లో 25 మంది ఉన్నారు. ఓవర్‌లోడ్‌తో పాటు అతి వేగం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే...స్థానికులుచెబుతున్న వివరాల ఆధారంగా చూస్తే మాత్రం ట్రక్‌లో కనీసం 30-35 మంది ఉన్నారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ట్రక్‌ లోయలో పడిన వెంటనే వాళ్లు స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సరైన సమయానికి కొందరిని హాస్పిటల్‌కి చేర్చారు. 






ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో బాధితులకు సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. 







ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. గాయపడ్డ వాళ్లకి అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 


Also Read: Iran: అధ్యక్షుడు రైసీ మృతితో ఇరాన్‌లో సంబరాలు, క్రాకర్స్ కాల్చుతూ కేక్‌లు కట్‌ చేస్తూ వేడుకలు