Iran President Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi Death) హఠాన్మరణం ఆ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. ఓ వైపు చాలా మంది పౌరులు విచారం వ్యక్తం చేస్తుంటే మరి కొంత మంది మాత్రం రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కాల్చుతున్నారు. కేక్‌లు కట్‌ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్‌లు ఆశ్చర్యపోతున్నారు. ప్రెసిడెంట్ చనిపోతే ఇలా వేడుకలు చేసుకుంటున్నారేంటని షాక్ అవుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ బతకకూడదని అందరూ కోరుకోవడం ఇదే తొలిసారి అంటూ ఇరాన్-అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు X లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది. నిజానికి ఆయన ఇరాన్‌కి అధ్యక్షుడిగానే కాకుండా అయతొల్ల తరవాత సుప్రీం లీడర్‌ పదవికి అర్హుడు అనే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ అర్హత ఉందని చాలా మంది తేల్చిచెప్పారు కూడా. కానీ..అధ్యక్షుడు చనిపోతే కొందరు ఎందుకిలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేదే చర్చకు దారి తీసింది. పైగా ఇబ్రహీం రైసీ ఓ కసాయి అంటూ నినదించడమూ సంచలనమవుతోంది. షియా ముస్లిం దేశమైన ఇరాన్‌కి రైసీ ఓ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి. 1979లో Islamic Revolution తరవాత ఈ దేశంలో చాలా మార్పులొచ్చాయి. షియా రూల్స్‌ని చాలా కఠినంగా అమలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు రైసీ. 






హిజాబ్‌ విషయంలో 2022లో అక్కడ ఏ స్థాయిలో గొడవలు (Hijab Protests in Iran) జరిగాయో ప్రపంచం అంతా గమనించింది. వేలాది మందిని జైళ్లలో బంధించారు. రోడ్లపైకి వచ్చి హిజాబ్‌కి వ్యతిరేకంగా నినదించిన మహిళలపైనా దాడులు చేశారు. అప్పటి నుంచి ఇరాన్‌ వార్తల్లో నిలుస్తూనే ఉంది. చాలా మంది మహిళలు ఇబ్రహీం రైసీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన చనిపోయారనగానే అందుకే వాళ్లంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం హిజాబ్‌ గురించే కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛనీ రైసీ అణిచివేశారన్న ఆరోపణలున్నాయి. మహిళల దుస్తుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించడం, పోలీసులకు మితిమీరిన అధికారులు ఇవ్వడం లాంటివీ విమర్శలకు తావిచ్చాయి. ఇక 1988లో డిప్యుటీ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన రైసీ జైల్లో ఉన్న రాజకీయ నేతల్ని ఉరి తీయడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయనకు Butcher of Tehran అనే చెడ్డ పేరు వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 5 వేల మందిని కిడ్నాప్ చేయించి వాళ్లందరినీ ఉరి తీయించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్ల గైడెన్స్‌లో రాజకీయ నేతగా ఎదిగిన ఇబ్రహీం రైసీపై ఇప్పటికీ కొన్ని వర్గాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. 


Also Read: Iran-India Relations: ఇరాన్ భారత్ మైత్రిని బలపరిచిన ఇబ్రహీం రైసీ, ఆయన హయాంలోనే కీలక ఒప్పందాలు