Fish Prasadam Distribution Dates: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీపై (Fish Prasadam Distribution) బత్తిని కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. జూన్ 8న శనివారం ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుందని.. ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో (Nampally Exhibition Ground) జూన్ 8న ఉదయం 11 గంటల నుంచి జూన్ 9న ఉదయం 11 గంటల వరకూ పంపిణీ ఉంటుందని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు, శివశంకర్ గౌడ్, గౌరీశంకర గౌడ్, శివశేఖర్ గౌడ్, సంతోష గౌడ్, మౌళి గౌడ్, రోషన్ గౌడ్ పాల్గొన్నారు.


తరతరాలుగా..


దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. 'ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తె ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తాం. ఈ ప్రసాదాన్ని వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. ఈ సేవ మా కుటుంబ పెద్దలకు 190 ఏళ్ల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారు. అప్పటి నుంచి నిస్వార్ధంగా ఉచితంగా లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకూ గత ప్రభుత్వాలన్నీ పూర్తి సహకారాన్ని అందిస్తూ అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యతగా ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాని కోరాం. చేప ప్రసాదం పంపిణీకి ఎప్పటిలాగానే ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, పోలీస్ శాఖలతో పాటు మత్య్స శాఖను కావాల్సిన చేపల్ని సిద్ధం చేయాల్సిందిగా లిఖిత పూర్వకంగా సంప్రదించాం' అని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ చేప ప్రసాదం ఎవరైనా తీసుకోవచ్చని.. గర్భిణీలు మాత్రమే తీసుకోవద్దని బత్తిని కుటుంబ సభ్యులు సూచించారు. పరగడుపున లేదా భోజనం తీసుకున్న 3 గంటల తర్వాత చేప ప్రసాదం తీసుకోవాలని అన్నారు.


ప్రత్యేక ఏర్పాట్లు


చేప ప్రసాదం కోసం వేలాదిగా తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. రోగులకు భోజనం, కాఫీ, టీ, టిఫిన్, మజ్జిగ, మంచినీరు అందిస్తామని అగ్రవాల్ సేవా దళ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెప్పారు. క్యూ లైన్ లో రోగులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా వాలంటీర్లు సేవలందిస్తారని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ రోజున దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు కౌంటర్లు ఉంటాయని తెలిపారు.