Patanjali Ads Case: పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండి పడింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ విషయంలో పతంజలి స్పందించలేదు. ఫలితంగా మరోసారి అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలోనే ఆచార్య బాలకృష్ణతో పాటు యోగా గురు రామ్‌ దేవ్ బాబాకి నోటీసులు పంపింది. ఈ నోటీసులపై స్పందిస్తూ ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. పతంజలి ఉత్పత్తుల్లో ఔషధ గుణాలున్నాయని తప్పుడు ప్రచారం చేసుకోవడంపై సుప్రీంకోర్టు మందలించింది. ఈ మేరకు ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. చట్టంపైన తనకు గౌరవముందని అందులో తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన ఆలస్యానికి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయమని కోర్టుకి వెల్లడించారు. దేశ ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని తప్ప మరో ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అది మాత్రమే చెప్పి పతంజలి ఉత్పత్తులను విక్రయించినట్టు తెలిపారు. ప్రాచీన గ్రంథాల్లో ఏముందో వాటి ఆధారంగానే ఈ ఉత్పత్తులను తయారు చేసినట్టు వివరించారు. ఆయుర్వేద పరిశోధనలు చేసినట్టు వెల్లడించారు. 


ఆయుర్వేదంపై పరిశోధనలు పెద్దగా లేనప్పుడు Drugs and Magic Remedies (Objectionable Advertisements) Actలో ప్రొవిజన్స్ చేర్చారని వివరించారు. ప్రస్తుతానికి ఆయుర్వేదంలో క్లినికల్‌ రీసెర్చ్‌లు జరుగుతున్నాయని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని వ్యాధులకు ఎలాంటి మందులు వినియోగించాలో అధ్యయనం చేసినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు ఆచార్య బాలకృష్ణ. 2006లో ఆచార్య బాలకృష్ణ, యోగా గురు రామ్‌ దేవ్‌ బాబా ఇద్దరూ కలిసి Patanjali Ayurved ని ప్రారంభించారు. ఆయుర్వేదం ఆధారంగా తయారు చేసిన ఉత్పత్తులని విక్రయిస్తూ వస్తున్నారు. అందులో ఎన్నో ఔషధ గుణాలున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇదే సుప్రీంకోర్టు అసహనానికి కారణమైంది. గోరంత దాన్ని కొండంత చేసి చెప్పుకోవడం సరికాదని స్పష్టం చేసింది. అంతకు ముందు రోజే పతంజలి తీరుపై మండి పడింది. ఆచార్య బాలకృష్ణతో పాటు రామ్‌ దేవ్‌ బాబాని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలనూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.