Passengers Requesting For Sankranthi Special Trains to Visakha: 'సంక్రాంతి' తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో భాగంగా అధిక శాతం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ వారి సంఖ్యే ఎక్కువ. అలాంటి వారు ఏడాదికోసారి కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని, సొంతూళ్లకు పయనమవుతారు. అయితే, ప్రస్తుతం రైళ్లన్నీ ఫుల్ కావడంతో ప్రయాణం ఎలా అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అంటే శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram), విశాఖ (Visakha) వెళ్లే రైళ్లు విశాఖ ఎక్స్ ప్రెస్, ఫలక్ నుమా, వందే భారత్, గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గరీభ్ రథ్, ఈస్ట్ కోస్ట్, దురంతో వంటి రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. దాదాపు అన్నీ రిగ్రెట్ అని చూపిస్తున్నాయి. దీంతో ఈసారి పండుగను సొంతూరిలో చేసుకోవాలనేది కలగానే మిగిలిపోతుందేమోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిద్దామన్నా, అన్నీ ట్రావెల్స్ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలు పెంచేసి చూపిస్తున్నారని వాపోతున్నారు. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల 20 ప్రత్యేక రైళ్లు వేసినా విశాఖ వైపు ఒకటీ లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా, రద్దీ దృష్ట్యా ఉత్తరాంధ్ర వైపు సంక్రాంతికి రైళ్లు వేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే, ఉన్న రైళ్లకు అదనపు బోగీలైనా జత చేసి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చేలా చేయాలని కోరుతున్నారు.
ఆ రూట్లలో 20 ప్రత్యేక రైళ్లు
మరోవైపు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే కొన్ని మార్గాల్లో 20 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఈ రైళ్లను హైదరాబాద్ - తిరుపతి, కాచిగూడ - కాకినాడ టౌన్ రూట్లలో నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
- కాచిగూడ - కాకినాడ టౌన్ (రైలు నెం - 07653) ఈ నెల 28న (గురువారం) రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
- కాకినాడ టౌన్ - కాచిగూడ (రైలు నెం - 07654) ఈ నెల 29న (శుక్రవారం) సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.
- హైదరాబాద్ - తిరుపతి (రైలు నెం 07509) గురువారం రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.
- తిరుపతి - హైదరాబాద్ రైలు (07510) శుక్రవారం రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
- కాచిగూడ - కాకినాడ టౌన్ - కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
- హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07509/07510) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ. నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Also Read: Weather Latest Update: హైదరాబాద్‌లో 14 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఈ జిల్లాల్లో మరింత తక్కువ!