Shivasena Party Symbol Row:
థాక్రేతో మాట్లాడిన పవార్..
శివసేన పార్టీ పేరు, గుర్తు శిందే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దీనిపై ఇప్పటికే మండి పడిన థాక్రే వర్గం న్యాయ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించింది. అయితే...ఈ వివాదంపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ థాక్రేతో మాట్లాడారు. ఓ సలహా కూడా ఇచ్చారు. ఇదేమంత ప్రభావం చూపించదని, ప్రజలు కొత్త పార్టీ గుర్తుని కూడా ఆదరిస్తారని ధైర్యం చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పుని గౌరవించాలని సూచించారు.
"ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఓసారి నిర్ణయం తీసుకున్నాక దానిపై చర్చ అనవసరం. ఈ నిజాన్ని అంగీకరించండి. కొత్త పార్టీ గుర్తుని ఎంచుకోండి. అసలు ఈ విషయం మనపై పెద్దగా ప్రభావం చూపనే చూపదు. మహా అయితే మరో 15 రోజులు దీని గురించి మాట్లాడుకుంటారంతే. అంతకు మించి ఏమీ ఉండదు"
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
అంతే కాదు. గతంలో కాంగ్రెస్‌కూ ఇలాంటి సమస్యే ఎదురైందని, కానీ క్రమంగా ప్రజలు ఆ పార్టీని ఆదరించారని గుర్తు చేశారు శరద్ పవార్. మొదట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుర్తులో "రెండు ఎద్దులు" ఉండేది. ఎంతో మథనం తరవాత ఇందిరా గాంధీ ఆ గుర్తుని తొలగించి "చేతి" గుర్తుని చేర్చింది. ఇదే విషయాన్ని ఉద్దవ్ థాక్రేకు వివరించారు శరద్ పవార్.
"ఇందిరా గాంధీ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తులో రెండు ఎద్దులుండేవి. ఆ తరవాత ఆ పార్టీ గుర్తుని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు ఇందిరా గాంధీ చేతి గుర్తుని ఎంచుకున్నారు. ప్రజలు ఆ గుర్తుని అంగీకరించారు. ఇప్పుడు కూడా ప్రజలు మీ పార్టీ గుర్తుని యాక్సెప్ట్ చేస్తారు"
-థాక్రేతో శరద్ పవార్
థాక్రే సేన ఆగ్రహం..
శివసేన పార్టీకి చెందిన పేరుని, పార్టీ గుర్తుని ఏక్‌నాథ్ శిందేకి కేటాయిస్తూ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దీనిపై తీవ్ర అసహనానికి గురవుతోంది థాక్రే సేన. శిందేపై చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న థాక్రేకు పెద్ద దెబ్బే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. థాక్రే సేనలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికీ ఈ మీటింగ్‌కు రెడీ అయిపోయారు. పార్టీ కార్యాలయమైన మాతోశ్రీలో వీరంతా సమావేశం కానున్నారు. ఏక్‌నాథ్ శిందే వర్గానికే శివసేన పార్టీ పేరు, ధనుస్సు గుర్తు చెందుతాయని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకే ఎమర్జెన్సీ మీటింగే పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఏమీ తేల్చక ముందే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం ఎలా తీసుకుందని వాదిస్తోంది థాక్రే సేన. ఈ విషయంలో ఈసీకి ఎందుకంత తొందర అంటూ ప్రశ్నిస్తోంది.
Also Read: Kedarnath Yatra 2023: కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునేది అప్పుడే, తేదీ వెల్లడించిన అధికారులు