MP's Form Rajya Sabha Suspension: 


34 మంది ఎంపీలు సస్పెండ్..


లోక్‌సభలో 33 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన కాసేపటికే రాజ్యసభలోనూ 34 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ సస్పెన్షన్‌కి గురయ్యారు. ఇవాళ ఒక్కరోజే (డిసెంబర్ 18) రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళన చేశారు. 






ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల గొంతుని అణిచివేయడం తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచనే లేదని మండి పడ్డారు.


"కేవలం ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ సభను నడుపుతున్నారు. ప్రతిపక్షాల గొంతుని అణిచివేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందిని సస్పెండ్ చేయడమే వాళ్ల లక్ష్యం. ప్రజల సమస్యలు, భద్రతా వైఫల్యంపై చర్చ కోరితే ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. పార్లమెంట్‌ కేవలం ఎంపీలను సస్పెండ్ చేసేందుకే తప్ప చర్చలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ







లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటన ( Security Breach)పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం శీతకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు (Delhi Police Teams) ఆరు రాష్ట్రాల (Six States )కు వెళ్లాయి. నిందితులను కూడా వెంట తీసుకెళ్లాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కేసు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వాపరాలను మరో 50 బృందాలు సేకరిస్తున్నాయి. పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఫోన్లను అతడు దహనం చేసినట్లు గుర్తించారు. కాలిపోయిన ఫోన్లను ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.


Also Read: MP's Suspension: ఒకేసారి 33 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు, లోక్‌సభ సంచలన నిర్ణయం