33 Opposition MP's Suspension:
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. లోక్‌సభలో దాడి ఘటన తరవాత ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. సభలో ప్రవర్తనా నియమావళి పాటించని కారణంగా ఇప్పటికే పలువురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మరో 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరితో పాటు 33 మంది ఎంపీలు లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. అధిర్ రంజన్ చౌదరితో పాటు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేక్ సస్పెండ్‌కి గురైన వారిలో ఉన్నారు. సభ ఛాంబర్‌లో నిరసన వ్యక్తం చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. భద్రతా వైఫల్యం ఘటనపై సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఎంపీలు. గత వారమే సభలో గందరగోళం చేసినందుకు 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే...ఇప్పుడు సస్పెన్షన్‌కి గురైన వారిలో కొందరు Privileges Committee నుంచి రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయంపై అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఎంపీలపై సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా ప్రతిపక్షాలు ఈ అంశంపై వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.
"నాతో పాటు చాలా మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మాపై సస్పెన్షన్ వేటుని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లోక్‌సభ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభలో మాట్లాడాలన్నదే మా డిమాండ్. మీడియాలో మాత్రం రోజుకో ప్రకటన చేస్తున్నారు. సభలో మాట్లాడడానికి సమస్య ఏంటి..? పార్లమెంట్‌లో మాత్రం అసలు నోరు మెదపడం లేదు. మేం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామనుకున్నాం. కానీ ప్రభుత్వం ఇలా దౌర్జన్యం చేస్తోంది"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
ఇప్పటి వరకూ ప్రధాని ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భద్రతా అధికారులతో మాత్రం భేటీ అయ్యారు. దాడి ఎలా జరిగిందో ఆరా తీశారు. ఎక్కడెక్కడ భద్రతా లోపాలున్నాయో వాటిని సరి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించినట్టు Dainik Jagran వెల్లడించింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ దాడిని తక్కువ అంచనా వేయకూడదని భద్రతా పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ తేల్చి చెప్పినట్టు వెల్లడించింది దైనిక్ జాగరణ్.