Parliament Security Breach Case: పార్లమెంటు (Parliament)లో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ( Mastermind )లలిత్ ఝా (Lalit jha)...కర్తవ్యపథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రాజస్థాన్ పారిపోయిన లలిత్ ఝా...ఢిల్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు...దాడి ఘటనపై విచారిస్తున్నారు. మరోవైపు లోక్‌సభలోకి వెళ్లి స్మోక్ అటాక్ చేసిన సాగర్ శర్మ, మనోరంజన్...పార్లమెంట్ బయట రచ్చ చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను కోర్టులో హాజరు పరిచారు. వారిని న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది.
వీరందరికి గుర్గావ్‌లో ఆశ్రయించిన విక్కీ శర్మ, అతని భార్యను పోలీసులు విడుదల చేశారు. లోక్‌సభ లోపల, బయట దాడిలో నలుగురులు నిందితులకు లలిత్ ఝానే సూచనలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే ఈ దాడికి ప్లాన్ చేశారని, గతంలో పార్లమెంటులో రెక్కీ కూడా చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో ఏ టెర్రర్ గ్రూపులకు సంబంధం లేదని తేలింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు...విచారణలో భాగంగా సీన్‌ను రీక్రియేట్ చేయనున్నారు. కోల్‌కత్తాకు చెందిన లలిత్ ఝా...ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంచలనం రేపాలని అనుకున్నాడు. గురుగ్రామ్‌లోని విక్కీ శర్మ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, నీలమ్ అజాద్, ఆమోల్ షిండేలను పిలిపించాడు. బుధవారం వీరంతా మాట్లాడుకొని...ఆరుగురు లోపలికి వెళ్లి స్ప్రే చేయాలని భావించారు. ఇద్దరికే ఎంట్రీ దొరకడంతో విజిటర్స్ పాసులతో సాగర్ శర్మ, మనోరంజన్...లోక్‌సభలోకి వెళ్లారు.
పార్లమెంట్ బయట నీలమ్, ఆమోల్ షిండేలు పొగ స్ప్రే చేశారు. లలిత్ ఝా వీడియో రికార్డు చేశాడు. అక్కడి నుంచి రాజస్థాన్ పారిపోవడానికి ముందే...సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. మీడియాలో కవరయ్యేలా చూడాలని ఓ ఎన్జీవోకు వీడియో క్లిప్ పంపాడు. దాడికి ముందే నలుగురి ఫోన్లను లలిత్ తీసుకున్నాడు. నిరుద్యోగం, మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగానే దాడి చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్.. పార్లమెంటులోకి ప్రవేశించేందుకు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి విజిటింగ్ పాస్‌లు తీసుకున్నాడు. తనతోపాటు తన స్నేహితుడు అని చెప్పి సాగర్ శర్మకు కూడా మరో పాస్ ఇప్పించాడు. మనోరంజన్ పిలుపు మేరకు మిగతా వారు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలోనే మనోరంజన్ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉందని సమాచారం. దీనిపైనా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, ఒక్కరోజే 15 మంది సస్పెండ్
Also Read: పార్లమెంట్ భద్రతా అధికారులతో ప్రధాని మోదీ భేటీ,లోక్‌సభ ఘటనపై చర్చ