Security Breach in Lok Sabha: 


15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు..


పార్లమెంట్‌లో ఒక్కరోజే 15 మంది ఎంపీలు సస్పెండ్ (15 Opposition MPs Suspended) అయ్యారు. ప్రొసీడింగ్స్ సమయంలో సభకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో 14 మంది లోక్‌సభకు చెందిన ఎంపీలుండగా..మరొకరు రాజ్యసభ ఎంపీ. కనిమొళి కరుణానిధి, మాణికం ఠాగూర్, పీఆర్ నటరాజన్ సహా పలువురు ఎంపీలపై (MP's Suspension) ఈ వేటు పడింది. రాజ్యసభ TMC ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ సస్పెన్షన్‌కి గురైన కాసేపటికే 14 మంది ఎంపీలూ సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై (Parliament Security Breach) రెండు సభల్లోనూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఈ కారణంగా ప్రొసీడింగ్స్‌కి అంతరాయం కలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్‌షా ఈ ఘటనపై స్టేట్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల  కారణంగా సభ సజావుగా సాగలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ ఎంపీలందరినీ సస్పెండ్ చేస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే హోంశాఖకి లేఖ రాశారని వివరించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. కానీ...ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండి పడ్డారు. 


"పార్లమెంట్ హౌజ్ భద్రతపై స్పీకర్ రివ్యూ చేశారు. హోం శాఖ సెక్రటరీకి ఇప్పటికే ఓం బిర్లా లేఖ రాశారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి"


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి


కనిమొళి ఆగ్రహం..


సస్పెన్షన్‌కి గురైన డీఎమ్‌కే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. ఏ ఎంపీ ఆఫీస్ నుంచి విజిటింగ్ పాస్‌లు తెచ్చుకుని నిందితులు లోపలికి వచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఎంపీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండి పడ్డారు. మహువా మొయిత్రా విషయంలో మాత్రం ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా సభలో ఈ ఘటనపై మాట్లాడాలని.. కచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.