Parliament Budget Session Live Updates: గరీబీ హఠావో నినాదం ఇన్నాళ్లకు నిజమవుతోంది - మోదీ సర్కార్‌పై రాష్ట్రపతి ప్రశంసలు

Advertisement

Parliament Budget Session: పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Ram Manohar Last Updated: 31 Jan 2024 11:58 AM
ఆర్టికల్ 370 రద్దు చారిత్రక నిర్ణయం

"రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌ మన లక్ష్యం. దేశవ్యాప్తంగా 10 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌లు నిర్మించుకున్నాం. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చారిత్రక నిర్ణయం. ఇలాంటి ఎన్నో ఘనతలు ఇన్నేళ్లలో సాధించగలిగాం"


- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Continues below advertisement
అయోధ్య ప్రస్తావన

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంతో అద్భుతమైన ఘట్టం అని ప్రశంసించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్నో అడ్డంకులు అధిగమించి నిర్మాణం పూర్తి చేయగలిగామని స్పష్టం చేశారు. 

Background

Parliament Budget Session 2024 Updates:


ఆఖరి దఫా పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల నాటికి కొత్త సభ్యులు, కొత్త ప్రభుత్వ కొత్త మంత్రిమండలి కొలువు దీరి ఉంటుంది. అందుకే ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఈ సమావేశాల్లోనే బడ్జెట్‌ కూడా ప్రవేశ పెట్టబోతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. 


తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం 


ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఆఖరి ప్రసంగం కూడా అవుతుంది. వచ్చే సమావేశాలు కొత్త ప్రభుత్వం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తన ఆఖరి తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటిన పెట్టనుంది. పెట్టేది ఓట్ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కాబట్టి ఈసారికి ఆర్థిక సర్వే సభ ముందు ఉంచడం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గురువారం నేరుగా 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభ ముందు ఉంచబోతున్నారు. 


వ్యూహ- ప్రతివ్యూహాలు  


ఎన్నికల ముందు జరిగే సమావేశాలు కాబట్టి వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు, వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు సిద్దమయ్యాయి. విపక్షాలపై పెడుతున్న కేసులు, జరుగుతున్న ఈడీ, సీబీఐ దాడులు ఇలా వాటన్నింటిపై నిలదీయాలని రెడీ అవుతున్నాయి. దీనిపై ఎక్కువ చర్చించేలా చేయాలని చూస్తున్నాయి. అదే టైంలో తాము చేసిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ఎక్కువ చర్చ జరగాలని అధికార పార్టీ సంసిద్ధమైంది. పార్టీలు చేస్తున్న అవినీతి, వారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అక్రమాలు ప్రజల ముందు ఉంచాలని చూస్తోంది. 


నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభంపై కాంగ్రెస్ ఫోకస్ 


ప్రతి సమావేశానికి ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేతలు పలు అంశాలను లేవనెత్తారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, జాతిపరంగా దెబ్బతిన్న మణిపూర్ పరిస్థితి వంటి అంశాలను ఈ సమావేశాల్లో లేవనెత్తుతామని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సురేష్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పార్లమెంటులో తాము లేవనెత్తాలనుకుంటున్న అంశాలను హైలైట్ చేశారు. 


ఏ చర్చకైనా సిద్ధమంటున్న ప్రభుత్వం


ఫిబ్రవరి 9న ముగియనున్న 17వ లోక్‌సభ సమావేశాల ప్రధాన ఎజెండా రాష్ట్రపతి ప్రసంగం, మధ్యంతర బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం అని ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్వల్పకాలిక సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వానికి శాసనపరమైన ఎజెండా లేదని, రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ, మధ్యంతర బడ్జెట్, జమ్ముకశ్మీర్ బడ్జెట్ సమర్పణపై ప్రధానంగా దృష్టి సారిస్తామని జోషి చెప్పారు. 


రాహుల్ పర్యటనపై దాడి అంశం కుదిపేయనుందా
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, జనతాదళ్ యునైటెడ్ నేత రామ్ నాథ్ ఠాకూర్, తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ తదితరులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. అసోంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి, దానిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల అంశాన్ని లేవనెత్తానని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున హాజరైన కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు.


ఎగువ సభలో కాంగ్రెస్ ఉపనేత తివారీ మాట్లాడుతూ దేశంలో అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలుతోందన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలతో సంప్రదింపుల తర్వాత ఈ అంశాలను లేవనెత్తానని తివారీ చెప్పారు. 


ఈ సమావేశాల్లో  చాలా మార్పులు చేశారు. జీరో అవర్‌, క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు. మొదటి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం రెండో రోజు బడ్జెట్‌ ఉంటుంది కాబట్టి ఆరోజు కూడా వేరే కార్యకలాపాలకు ఆస్కారం ఉండదు. మూడో రోజు ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. 


 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.