Pappu Yadav seen distributing money to Flood Victims: ప్రజలు ఓట్లు వేస్తేనే ఎంపీ అవుతారు. కానీ ఎంపీ అయిన తర్వాత ఏం చేయాలి. ఆ ప్రజల మీదే సవారీ చేయాలి. వాళ్లను పురుగుల్ని చూసినట్లుగా చూడాలి. దానికి ఈ బీహార్ ఎంపీ పప్పూ యాదవే సాక్ష్యం. పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చాయి. ప్రజల్ని పరామర్శించడానికి వెళ్లిన ఆయన కొన్ని నోట్ల కట్టల్ని తీసుకెళ్లారు. తన లగ్జరీ కారులో అలా కూర్చుని చిన్నగా వెళ్తూంటే.. ఒక్కో నోటు తీసి.. తనను అడిగిన వారికి ఇస్తూ పోయారు. ఈ దృశ్యాలును ఆయన సోషల్ మీడియా టీమ్ చిత్రీకరించి .. తమ ఎంపీ దానకర్ణుడని ఎలివేషన్ ఇచ్చుకుంది.  

పప్పు యాదవ్ తనను తాను పేదల హితైషిగా చెప్పుకుంటూ ఉంటారు.   "నా జీవితం, ఆస్తి పేదలు , బాధితుల కోసమే" అని చెబుతూంటారు.  లగ్జరీ కారు నుండి నగదు విసరడం, వీడియో వైరల్ కావడం వంటివి నాటకీయంగా, అసమంజసంగా కనిపిస్తున్నాయని  ..మనుషుల్ని ఇలా పరుగెత్తించి సాయం చేయడం ఏమిటని మండిపడుతున్నారు. 

 పప్పూ యాదవ్ పూర్ణియా  నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు. ఆయన అసలు పేరు రాజేష్ రంజన్. అందరూ పప్పు యాదవ్ అని పిలుస్తారు.  పప్పూ యాదవ్ 1990లో సింగేశ్వర్, మాధేపురా నుండి బీహార్ శాసనసభకు మొదటి సారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 1991, 1996, 1999, 2004, 2014 సంవత్సరాల్లో పూర్ణియా, మాధేపురా నియోజకవర్గాల నుండి స్వతంత్ర, సమాజ్ వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తరపున ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు. 2015లో RJD నుండి బహిష్కరించారు. 

పప్పూ యాదవ్‌పై అనేక క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి.  హత్య, దోపిడీ, బెదిరింపులు, కిడ్నాపింగ్, పోలీసులపై దాడి వంటి కేసుల్లో నిందితుడు. 1998 జూన్ 14న పూర్ణియా శాసనసభ్యుడు సర్కార్‌ను హత్య చేసిన కేసులో   ప్రధాన నిందితుడు.   2008లో అతనికి జీవిత ఖైదు విధించబడింది. అయితే, ఈ కేసులో తర్వాత బెయిల్ పొందాడు.