Karnataka Minister Rajanna resigns : కర్ణాటక సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న తన మంత్రి పదవికి ఆగస్టు 11, 2025న రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ ఓటర్ జాబితా అక్రమాలపై ఆరోపణలపై ఆయన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించడం వంటి కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమికి ఎన్నికల సంఘం (ECI) పక్షపాతం, ఓటర్ జాబితాలో అవకతవకలు కారణమని ఆరోపించారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఒక ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అయేత మంత్రి రాజన్న, ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. ఓటర్ జాబితా సవరణలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ సమయంలో పార్టీ ఈ అంశంపై శ్రద్ధ చూపలేదని వ్యాఖ్యానించారు. "మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ జాబితా సవరణ జరిగింది. అప్పుడు మనం ఎందుకు అబ్జెక్షన్‌లు లేవనెత్తలేదు? ఇది మనకే అవమానం" అని ఆయన అన్నారు.
రాజన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ఆగ్రహం తెప్పించాయి. రాజన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అధినాయకత్వాన్ని అవమానించారని ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్ హైకమాండ్, రాజన్న వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి, ఆయనను మంత్రి పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సూచించింది. రాజన్న సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజన్న, విధానసభ సలహా సమితి (BAC) సమావేశం జరుగుతున్న సమయంలో సిద్దరామయ్య కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన తన రాజీనామాను ధృవీకరిస్తూ, సీఎంను సంప్రదించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
సీఎం సిద్దరామయ్యకు సన్నిహితుడిగా రాజన్న ఉన్నారు. రాజన్న గతంలో డి.కె. శివకుమార్‌ను విమర్శించారు. హనీట్రాప్ ఆరోపణలు చేయడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య , డి.కె. శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం ఉన్న రాజకీయ పోటీ కారణంగా రాజన్న వ్యాఖ్యలు శివకుమార్ మద్దతుదారులకు కోపం తెప్పించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, రాజన్న వ్యాఖ్యలను "సత్యం" అని పేర్కొంటూ, కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని నిందించడం ఓటమి నిరాశ నుండి వచ్చినదని విమర్శించారు.