Congress Govt borrowing limit | హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ఇదంతా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అని తాజా కాగ్ నివేదిక అందుకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, చేతికానితనం కారణంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో తెలంగాణ ఆదాయం బాగా తగ్గిందని కాగ్ నివేదికలో వెల్లడైందన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఆరు గ్యారంటీలు
‘కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం 6 గ్యారంటీలను ఇచ్చింది. కానీ అదే హామీలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆర్థిక రంగానికి హామీలే తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతోంది, మరోవైపు అప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది రాకెట్ శాస్త్రం మాత్రం కాదు. అందరికి అర్థమయ్యే లెక్కలు, వివరాలే. కాంగ్రెస్ నేతల అనుభవ లేమి, పాలనా వైఫల్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది..
మిగులు బడ్జెట్ అన్నారు.. పెద్ద మొత్తంలో అప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వం ₹2,738 కోట్లు మిగులు బడ్జెట్ చూపించారు. కానీ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే సమయానికి తెలంగాణకు ₹10,583 కోట్ల ఆదాయ లోటు వచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకుంది. ఇది వార్షిక లక్ష్యంలో 37.5 శాతం. మరోవైపు రాష్ట్రంలో పన్నేతర ఆదాయాలు తీవ్రమైన తగ్గుదలను సూచిస్తున్నాయి. రూ.2,26,720 కోట్ల బడ్జెట్‌లో కేవలం 3.37 శాతం మాత్రమే ఆదాయాన్ని సాధించారు.
ప్రాజెక్టులు, పథకాలకు నిధుల్లేవ్.. డబ్బులు ఎక్కడ పోతున్నాయ్
ఒక కొత్త రోడ్డు వేయకుండా, ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించకుండా, విద్యార్థులకు మంచి భోజనం ఇవ్వకుండానే ఈ ప్రభుత్వం ఏకంగా రూ.20,266 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చు చేసిన డబ్బు ఎక్కడికి పోతోంది? ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని, గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితిని ఎలా వివరించగలరు?. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు దీనికి వారి వద్ద ఉన్న పరిష్కారం ఏంటో స్పష్టంగా చెప్పగలరా?’ అని కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి నోట్ల మూటలు మోసేందుకు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టులు చేపట్టకుండా, రైతులు, మహిళలకు హామీలు అమలు చేయకుండా పైసలు ఎక్కడికి పోతున్నాయి అని కేటీఆర్ ప్రశ్నించారు.