Border Love Story : ప్రేమ కోసం సరిహద్దులు దాటే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా బోర్ కొట్టవు. ఎందుకంటే ప్రతీ లవ్ స్టోరీలోనూ ఓ ట్విస్ట్ ఉంటుంది. అయితే ఇలాంటి బోర్డర్ లవ్ స్టోరీ నిజంగా జరిగితే..!. జరిగింది కూడా. అయితే ఇక్కడ వాళ్లు సక్సెస్ కాలేదు. పట్టుబడ్డారు. జైలు పాలయ్యారు. ఈ ప్రేమికుల్లో ఒకరు హైదరాబాదీ అయితే మరొకరు పాకిస్థానీ. ఈ రియల్ లవ్ స్టోరీలో అంత కన్నా ట్విస్ట్ ఏముంటుంది ?
హైదరాబాదీని ప్రేమించిన పాకిస్థాన్ యువతి
కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ఉంటుంది. ఆమెకు ఆన్‌లైన్‌లో అహ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అహ్మద్ హైదరబాద్ యువకుడు. సౌదీలో ఒక హోటల్‌లో పనిచేస్తూంటాడు. ఆన్‌లైన్‌లో కలిజానూర్‌తో చాటింగ్ చేసేవాడు. తర్వాత పరిచయం బాగా పెరిగి ప్రేమించుకున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అహ్మద్ ఇండియన్ అయితే.. నూర్‌ది పాకిస్థాన్. వీళ్ల లవ్ స్టోరీలో ఇదొక్కటి చాలు కదా ట్విస్ట్ ఏర్పడటానికి. అందుకే ఈ అడ్డంకిని అధిగమించడానికి వారు మరో ప్రణాళిక వేశారు. అదేమిటంటే... అక్రమంగా నూర్‌ను పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి తీసుకు రావడం.
ఇప్పుడు 1962 కాదు చైనా, గుర్తు పెట్టుకో- ఇది నయా భారత్ తట్టుకోలేవు!
అక్రమంగా యువతిని భారత్‌లోకి తేవాలని లవర్ ప్లాన్
అహ్మద్ ముందుగా పాకిస్తానీలు ఇండియాలోకి ఎలా వస్తారో ఓ పరిశోధన చేశాడు. అనేక సలహాలు తీసుకుని చివరికి నేపాల్ మీదుగా నూర్‌ను ఇండియాలోకి తీసుకు రావాలని డిసైడయ్యాడు. ఇందు కోసం అవసరమైన నకిలీ పత్రాలను రెడీ చేసుకున్నాడు. తనతో కలిసి పనిచేసే నేపాలీ స్నేహితుల సాయంతో భారత్‌కు తీసుకొచ్చే ప్లాన్ వేశాడు.ఈ ప్లాన్ ప్రకారం, దుబాయ్ నుంచి నేపాల్ వచ్చిన నూర్.. అక్కడ జీవన్ అనే వ్యక్తితోపాటు అహ్మద్ సోదరుడు మహమూద్‌ను కలిసింది. అనంతరం ముగ్గురూ కలిసి నూర్‌ను భారత్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇండో-నేపాల్ బోర్డర్ పోలీసులకు అనుమానం వచ్చింది.
కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!
నకిలీ పత్రాలను గుర్తించి బోర్డర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
కలిజా నూర్ వద్ద ఉన్న ధ్రువపత్రాలు నిశితంగా పరిశీలించి విచారించారు. నకిలీవని తేలడంతో.. ఆమె పాక్ గూఢచారేమో అని అనుమానించారు. దాంతో నూర్‌తోపాటు జీవన్, అహ్మద్‌ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో.. తను ప్రేమించిన వాడి కోసం నూర్ ఇంతటి సాహసం చేసిందని గుర్తించారు. అయితే అక్రమంగా బోర్డర్ దాటడం నేరం కాబట్టి.. ముగ్గురినీ స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ప్రేమకథకు బోర్డర్‌లో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇక సినిమాల్లో చూపించినట్లుగా... జైలు నుంచి విడుదలై వారి ప్రేమను సఫలం చేసుకుంటారో లేదో వారి చేతుల్లోనే ఉంది. అయితే ఈ ప్రేమికుల గురించి పోలీసులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అన్నీ లీగల్‌గా ప్రయత్నించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అంటున్నారు.