India China Border: యుద్ధం అనేది చాలా సీరియన్ అంశం. అలాంటి విషయాన్ని జనరల్స్‌కు వదిలేయాలని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అప్పటి ఫ్రెంచ్ ప్రధాని జార్జెస్ బెంజమిన్ క్లెమెన్సౌ అన్నారు. అయితే జనరల్స్‌తో సంప్రదింపులు జరపకుండా, వారు లేకుండా ప్రణాళికలు రచిస్తే, ఉత్తమ వ్యూహాలు కూడా ఎలా విఫలమవుతాయో చరిత్ర చెబుతోంది. 1962 ఇండియా-చైనా యుద్ధంలో మన పరాజయం కావడానికి ఇదే కారణం. 


1959లో అప్పటి తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ SPP థోరట్.. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ అరుణాచల్ (NEFA)ను రక్షించేందుకు 'థోరట్ ప్లాన్' అని ఇప్పుడు పిలుస్తోన్న ఓ ప్రణాళికను రచించారు. 


1959, అక్టోబర్ 8న థోరట్ ప్లాన్‌ను ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు పంపారు. అక్కడ చీఫ్ జనరల్ కేఎస్ తిమ్మయ్య దానిని ఆమోదించారు. అప్పటి రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్‌కు వ్యక్తిగతంగా ఆ ప్రణాళికను చూపించారు. 


దురదృష్టవశాత్తూ మీనన్ ఈ ప్రణాళికను అనవసరమని తోసిపుచ్చారు. దౌత్యంతో చైనీయులను తానే స్వయంగా ఆపగలననే విశ్వాసంతో ప్రగల్భాలు పలికారు. థోరట్ ప్లాన్‌ను అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకి కూడా చూపించలేదు. ఇది వాళ్లు చేసిన తప్పు. 


1962 పరాజయం


1962 నవంబర్ 20న కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు చైనా నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. తేజ్‌పుర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమాచారం భారత్‌కు ఆలస్యంగా చేరింది. దీంతో నవంబర్ 22 నాటికి అసోంలోని తేజ్‌పుర్ మొత్తం ఖాళీ అయింది. చైనా ఆర్మీ రావడం చూసి ప్రజలు ఆ పట్టణం నుంచి పారిపోవాల్సి వచ్చింది. 


భారత రక్షణ వ్యవస్థ కుప్పకూలింది. సైన్యం పతనమైంది. ఘోర పరాజయాన్ని చవిచూశాం. ఈ పరాజయం ప్రభావం ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది. అయితే చైనీయులు NEFAలోని వాటర్‌షెడ్‌ను వీడి వెళ్లారు. కానీ తూర్పు లద్దాఖ్‌ను మాత్రం ఇప్పటికీ వదల్లేదు. 


చైనా తన బలగాలను NEFA నుంచి ఉపసంహరించడానికి ప్రధాన కారణం అక్కడ రహదారులు, మౌలిక సదుపాయాల కొరత. అప్పట్లో చైనీస్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని దక్కించుకున్నా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేమని డ్రాగన్ దేశం అనుకుంది. అయితే ఆ యుద్ధంలో భారత సైన్యం చాలా వేగంగా ఓడిపోయింది. బహుశా అలాంటి ఫలితాన్ని భారత్ ఊహించి ఉండదు.


యుద్ధం ముగిసిన తర్వాత.. NEFAని రక్షించడానికి ఆ నాటి రక్షణ మంత్రి మీనన్ ఒకసారి పక్కన పెట్టిన థోరట్ ప్లాన్‌నే అమలు చేయాలని భారత్ నిర్ణయించుకుంది.


లద్దాఖ్ ఎందుకు భిన్నం?


లద్దాఖ్‌ భౌగోళికం భిన్నంగా ఉంది. అంతే కాకుండా అక్కడి వాస్తవాలు కూడా అంతే భిన్నం. లద్దాఖ్‌లో ముందున్న కొంత భాగం చైనా తన బలగాలను సులభంగా తరలించేందుకు కలిసివచ్చింది. భారత వైపు పర్వతాలతో కూడిన భూభాగం ఉంది. ఇది భారత డిఫెండర్లకు ప్రయోజనకరంగా ఉంది. అక్సాయ్ చిన్ ద్వారా చైనీస్ రహదారి, జిన్‌క్సియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్‌తో కలుపుతుంది. వేగంగా బలగాలను తరలించేందుకు ఈ రహదారులు చైనాకు బాగా కలిసి వచ్చాయి. కానీ మనకు ఎత్తైన పర్వతాలు ఉండటంతో భారత్ థోరట్ ప్లాన్‌ను అమలు చేస్తూ లద్దాఖ్‌ను డిఫెండ్ చేస్తున్నాం.


ఆ ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రయత్నించినప్పుడల్లా చైనా వ్యతిరేకిస్తూనే ఉంది. భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ ఒత్తిడి తెస్తోంది.


1960 నుంచి 1990ల వరకు భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాకిస్థాన్ నుంచి ఎదురైన సైనిక సవాళ్ల నుంచి ఆహార కొరత వరకు భారత్ 1965, 1971లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఆర్థికాభివృద్ధితో పాటు తన సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ తీవ్రంగా శ్రమించింది.


వనరుల కొరత కారణంగా, రక్షణ వ్యూహంలో భాగంగా NEFA మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయలేకపోయాం. వాస్తవ నియంత్రణ రేఖపై బలమైన వ్యూహాత్మక డిఫెన్స్ ద్వారా హిమాలయ సరిహద్దుల్లో చైనాను ఆపాలని ఆలోచించాం. 


కానీ మరోవైపు చైనాలో 1980వ దశకం తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. డెంగ్ జియావోపింగ్ హయాంలో చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంది. ఇది భారతదేశంతో అసమానతను సృష్టించింది. 1990ల ప్రారంభంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేసినప్పటికీ భారత్- చైనా మధ్య అభివృద్ధి వేగం అపరిమితంగా ఉంది. 


టిబెట్‌లో మౌలిక సదుపాయాలను చైనా వేగంగా పెంచింది. 1,956 కిమీ పొడవైన క్వింఘై-టిబెట్ రైల్వే (QTR)ని చైనా నిర్మించింది. ఇది లాసాను బీజింగ్, చెంగ్డు, చాంగ్‌కింగ్, గ్వాంగ్‌జౌ, షాంఘై, జినింగ్, లాన్‌జౌలకు అనుసంధానించింది. వ్యూహాత్మక పరంగా అన్ని ప్రధాన చైనా సైనిక ప్రాంతాలు ఈ రైల్వే నెట్‌వర్క్ ద్వారా లాసాకు అనుసంధానించగలిగారు. ఫార్వార్డ్ ట్రూప్ మూవ్‌మెంట్ కోసం LACకి కేవలం 50 కి.మీ దూరంలో ఉన్న లాసాను న్యింగ్‌చికి కలిపే రైల్వే లింక్ ఇటీవల 2021లో ప్రారంభించారు.


విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్, ఎయిర్‌ఫీల్డ్‌లు, ఫార్వర్డ్ స్టోరేజీ సౌకర్యాలు ఉండటంతో PLAకి సాధ్యమైనంత తక్కువ సమయంలో దళాలు, సామగ్రిని తరలించేందుకు వీలు కల్పించాయి. టిబెట్ మొత్తం 1,18,800 కి.మీ పొడవుతో రోడ్డు నెట్‌వర్క్‌ ఉంది. 


డోక్లాం నేర్పిన పాఠాలు   





2010 నుంచి LAC అంతటా PLA అతిక్రమణలు భారీగా పెరిగాయి. 4,000-కిమీ LACలో వివిధ ప్రదేశాలలో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారు. 2010 నుంచి 2013 మధ్య మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో 500 పైగా చొరబాట్లు జరిగాయి.


1962 యుద్ధం ముగిసినప్పటి నుంచి 2013 ఏప్రిల్‌లో చైనా నుంచి భారత్ అతిపెద్ద సవాలును ఎదుర్కొంది. దేప్సాంగ్ మైదానాల్లోని తూర్పు లద్దాఖ్‌లోని మన భూభాగంలో 10 కి.మీ మేర చైనా సైన్యం చొరబడింది. హెలికాప్టర్ల  ద్వారా చైనా తన సైన్యాన్ని ఇక్కడకు తరలించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. 


2017లో 73 రోజుల పాటు హిమాలయ ట్రైజంక్షన్‌లోని మారుమూల ప్రాంతంలో భారత్, చైనా దళాలు తలపడ్డాయి. ఆ సంవత్సరం జూన్‌లో చైనా సైన్యం, ఇంజనీర్లు డోక్లామ్ పీఠభూమి గుండా రహదారిని నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రాంతం మాదంటే మాదంటూ  చైనా, భూటాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.


ఈ ప్రాంతం వ్యూహాత్మక జల్‌పైగురి కారిడార్ భద్రతకు కీలకం. దీంతో భారత సైనికులు జోక్యం చేసుకుని చైనా సిబ్బందిని తమ ట్రాక్‌లో నిలిపివేశారు. ఫలితంగా రెండు ఆసియా దిగ్గజాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.


కొన్ని వారాల చర్చల తరువాత దిల్లీ, బీజింగ్ తమ దళాలను వారి అసలు స్థానాలకు ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. అయితే తన ప్లాన్ అమలుకాకపోవడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అప్పటికీ చైనా సైలెంట్‌గా సైన్యాన్ని మోహరించడం, ఆ ప్రాంతంలో కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడం కొనసాగించింది.  


ఇది జరిగిన మూడేళ్లకు భారత్, చైనా దళాలు మరోసారి ఘర్షణకు దిగాయి. దాదాపు 45 ఏళ్లలో తొలిసారిగా 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్,  చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఫలితంగా ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. భారీ సమీకరణలతో ఇరు దేశాలు యుద్ధం అంచు వరకు వచ్చాయి. 


ఆ ఘర్షణల నుంచి ఉత్తర హిమాలయ సరిహద్దులు కత్తిమీద సాముగానే ఉన్నాయి. ఇరుపక్షాలు పెద్ద సంఖ్యలో బలగాలు, సామగ్రిని తరలిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో రెండు ప్రభుత్వాలు దౌత్యపరంగా చర్చలనూ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలు విడతల్లో చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు.


భారత వైపు ఇన్‌ఫ్రా బూమ్


డోక్లామ్ సంక్షోభం తర్వాత భారత్ గత ఐదేళ్లలో 3,500 కి.మీ రోడ్లను నిర్మించింది. మరోవైపు చైనా టిబెట్‌లో సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఇందులో 60,000 కిమీ రైలు, రోడ్డు నెట్‌వర్క్ ఉన్నాయి. చైనీయులకు అక్కడి భౌగోళిక పరిస్థితులు ఇందుకు సహకరించాయి. కానీ భారత్‌కు ఇటువైపు పర్వతాలు ఉండటంతో మన పనులు నెమ్మదిగా సాగాయి.


చైనా జీ-695 ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని యోచిస్తోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్‌ను.. జిన్‌క్సియాంగ్‌తో కలుపుతూ LACకి సమాంతరంగా నడుస్తుంది. ఇది భారత్‌తో సరిహద్దు ప్రాంతాలకు దళాలను, భారీ పరికరాలను వేగంగా తరలించడానికి PLAకి మరో మార్గాన్ని అందిస్తుంది. మరోవైపు ఉత్తర, దక్షిణ ఒడ్డుల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం చైనా.. పాంగోంగ్‌ సో సరస్సు మీదుగా రెండో వంతెనను నిర్మిస్తోంది. 


ఇందుకు దీటుగా భారత్‌కు ఇప్పటికే హిమాలయాలకు సమాంతరంగా జమ్మూలోని వాయువ్యంలో ఉధంపుర్ నుంచి సుదూర తూర్పున అసోంలోని టిన్సుకియా వరకు 4,000 కిమీలకు పైగా విస్తరించి ఉన్న విస్తృతమైన రైలు, రహదారి నెట్‌వర్క్‌ ఉంది. త్వరితగతిన పర్వతాల మీదుగా LAC వరకు దళాలను, పరికరాలను వేగంగా తరలించడానికి భారత్‌కు ఫీడర్ రోడ్ నెట్‌వర్క్ అవసరం. ఈ 73 ICBRలు సరిగ్గా ఈ పనే చేస్తాయి.


- ఇది రాసిన వ్యక్తి రక్షణ రంగ నిపుణుడు, కాలమిస్ట్, రచయిత. ఇండియన్ డిఫెన్స్ రివ్యూ అసోసియేట్ ఎడిటర్, ABP న్యూస్‌ కన్సల్టెంట్.



[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]