Imran Khan:
ఇమ్రాన్ ఇల్లు స్వాధీనం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో PTI కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బందిపై ఇమ్రాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 25 మంది సిబ్బంది గాయపడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఇమ్రాన్ ఖాన్ సహా 12 మంది కార్యకర్తలపై ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఎదుట కూడా అల్లర్లకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ లాహోర్ నుంచి విచారణకు ఇస్లామాబాద్ కోర్టుకు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున అలజడి రేగింది. పోలీస్ చెక్‌పోస్ట్‌లను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలు, 7 బైక్‌లకు నిప్పంటించారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వాహనాన్నీ ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టులో విచారణకు ఇమ్రాన్ బయల్దేరిన వెంటనే వేలాది మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టు ముట్టారు. బారికేడ్లు, టెంట్‌లను తొలగించారు. వందలాది మంది మద్దతుదారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడులకు దిగారు. వారందరినీ చెదరగొట్టిన పోలీసులు ఇమ్రాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అటు పీటీఐ కార్యకర్తలు పోలీసులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనవసరంగా రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లోని కోర్టుకు వెళ్లే దారిలో ఉండగానే పోలీసులు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఇది జరిగిన సమయంలో ఇంట్లో ఆయన సతీమణి బుశ్రా బేగం ఉన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
"పంజాబ్ పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. నా భార్య ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు చొచ్చుకెళ్లారు. ఏ చట్ట ప్రకారం ఇలా చేస్తున్నారు..? ఇదంతా కచ్చితంగా లండన్ ప్లాన్‌లో భాగమే. నవాజ్ షరీఫ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోంది"
- ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని