Muhammad Iqbal Lesson:
మహమ్మద్ ఇక్బాల్ లెసన్ తొలగింపు..
ఇటీవలే NCERT సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై భిన్న వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విమర్శలూ ఎదురయ్యాయి. ఇదే క్రమంలో అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ (Academic Council of Delhi University) సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన రచయిత మహమ్మద్ ఇక్బాల్‌పై (Muhammad Allama Iqbal) ఉన్న లెసన్‌ని సిలబస్‌లో నుంచి తీసేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ సర్య్కులర్ కూడా జారీ చేసింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో నుంచి ఈ పాఠాన్ని తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. 1877లో సియాల్‌కోట్‌లో జన్మించారు మహమ్మద్ ఇక్బాల్. "సారే జహాసే అచ్ఛా" గీతాన్ని రచించింది ఈయనే. పాకిస్థాన్‌కి ఆద్యుడిగానూ ఆయనను పిలుచుకుంటారు. బీఏ ఆరో సెమిస్టర్ పేపర్‌లో Modern Indian Political Thought పేరుతో ఉన్న ఛాప్టర్‌లో ఇక్బాల్ గురించి ప్రస్తావన ఉంది. అయితే...ఈ లెసన్ ప్రస్తుతానికి అవసరం లేదని అకాడమిక్ కౌన్సిల్ భావిస్తోంది. తొలగిస్తున్నట్టు ప్రకటిస్తూనే...ఈ ప్రతిపాదనను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుంచింది. ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆ పాఠం ఉంటుందా లేదా అన్న క్లారిటీ వచ్చేస్తుంది. దీనిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ స్పందించింది. ఇక్బాల్ పాఠాన్ని తొలగించడాన్ని స్వాగతించింది.
"పొలిటికస్ సైన్స్ సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మహమ్మద్ ఇక్బాల్ పాఠాన్ని తీసేయాలని ప్రతిపాదించాం. ఇప్పటికే దీనిపై ఓ తీర్మానం కూడా చేశాం. రామ్ మోహన్ రాయ్, పండిత రమాబాయ్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, భీమ్‌రావ్ అంబేడ్కర్ పాఠాలు ఇందులో ఉన్నాయి. భారత రాజకీయాల్లోని వైవిధ్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలన్నదే మా ఉద్దేశం"
- అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ
ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ABVP ఇక్బాల్‌పై విమర్శలు చేసింది. భారత్ రెండు ముక్కలుగా విడిపోడానికి ఆయనే కారణమని మండి పడింది.
"ఢిల్లీ యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకోడాన్ని స్వాగతిస్తున్నాం. మహమ్మద్ ఇక్బాల్‌ని ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్‌గా పిలుచుకుంటారు. మహమ్మద్ జిన్నాకి వెనక ఉండి నడింపించింది ఇతనే. భారత్ రెండుగా ముక్కలవడానికి జిన్నాతో పాటు ఇక్బాల్ కూడా కారణమయ్యారు"
- ఏబీవీపీ
పాఠ్యపుస్తకాల్లో ఇటీవలే 'గాంధీ హత్య'కు సంబంధించిన అంశాలను తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ మరో ప్రముఖవ్యక్తికి సంబంధించిన విషయాలను తొలగించింది. పదకొండో తరగతి రాజనీతి శాస్త్రంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రస్తావనలను తొలగించింది. గతేడాది పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ చేపట్టిన ఆ సంస్థ కొత్తగా విడుదల చేసిన పుస్తకంలో ఈ మార్పులు చేసింది. పునరుక్తులు, సంబంధంలేని అంశాల పేరుతో ఈ తొలగింపులు చేపట్టింది. మొదటి, పదో చాప్టర్లలో ఉన్న మౌలానా ఆజాద్ ప్రస్తావనలను సంస్థ తొలగించింది. ఇప్పటికే గుజరాత్ అల్లర్లు, మొఘల్ కోర్టులు, అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ), ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం వంటి పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్టీ తన పుస్తకాల నుంచి తొలగించింది.