అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా దళాలకు పాకిస్థాన్ మద్దతు పలకడం వల్ల తాము భారీ మూల్యం చెల్లంచాల్సి వచ్చిందని తాజాగా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో అమెరికా పరాజయానికి తమపై నిందలు వేయడం తగదన్నారు.
రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌లో అగ్రరాజ్యం ఓటమిపై అమెరికా రాజకీయనేతలు ఇస్లామాబాద్‌ను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
ఇటీవల అమెరికా సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ.. తాలిబన్లకు పాక్ సాయం చేస్తుందని విమర్శించింది. ఈ వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ ఖండించారు.
కొత్త ప్రభుత్వం కోసం..
అఫ్గానిస్థాన్‌లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లతో చర్చించినట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అందులో తజిక్‌లు, హజారాలు, ఉజ్బెక్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. 40 సంవత్సరాల సంఘర్షణ తర్వాత అఫ్గాన్‌లో శాంతి, సుస్థిరతలు నెలకొనబోతున్నాయని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుత తాలిబన్ల సర్కార్‌లో 33 మంది సభ్యులున్నారు. అయితే ఇందులో ఒక్క హజారా సభ్యుడు గానీ, మహిళ గానీ లేరు.