విమానంలోగానీ.. బస్సులో గానీ.. మూడు సీట్లు ఉంటే.. చేతిని పెట్టుకొనే ఆర్మ్‌రెస్ట్ కోసం పెద్ద పోరాటమే జరుగుతుంది. ఆ సీట్లో కూర్చునేవారు ఒకే కుటుంబం లేదా స్నేహితులైతే పర్వాలేదు. వేర్వేరు వ్యక్తులు కూర్చుంటే మాత్రం.. రచ్చ రంబోలానే. పక్కోడు చేయి పెట్టకముందే దానిపై చేయి పెట్టేసి సొంతం చేసుకోవాలనే ప్రయత్నించేవారిని మీరు చూసే ఉంటారు. చూసేందుకు ఇది పిల్ల చేష్టలా ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పని చేసేస్తుంటాం. దీనివల్ల మధ్య సీటు అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇద్దరి మధ్యలో చేతులను ముడుచుకుని కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి?
అయితే, మూడు సీట్లకు మధ్యలో ఉండే ఆర్మ్‌రెస్ట్‌పై ఎవరికి హక్కు ఉంటుంది? దాన్ని ఎవరు ఉపయోగించాలి? అటూ కూర్చొనే పక్క సీటు ప్యాసింజర్ రెండు ఆర్మ్ రెస్టులు వాడితే మధ్యలో ఉండే ప్యాసింజర్ ఏది వాడాలి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అందుకు ఓ ఫ్లైట్ అటెండెంట్.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మధ్యలో ఉండే ఆర్మ్ రెస్టులపై ఎవరికి రైట్స్ ఉంటాయో వివరించాడు.
Also Read: పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు ఎందుకు? కారణం ఇదే..
‘కామన్ సెన్స్ ఆఫ్ ఫ్లయింగ్’ అనే ఎయిర్ ట్రావెల్ గైడ్ రచయిత బోరీస్ మిలన్ ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సందేహం గురించి చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్ జోను మధ్య సీటుకు ఉండే ఆర్మ్ రెస్ట్ ఎవరికి చెందుతుందని అడిగాడు. ఇందుకు జో సమాధానమిస్తూ.. మూడు సీట్లు ఉండే లైన్లో.. మధ్యలో కూర్చొనే వ్యక్తికే ఆ రెండు ఆర్మ్‌రెస్టులు ఉపయోగించే హక్కు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇటీవల మన్నెరస్మిత్ ఏటిక్యూట్టే కన్సల్టింగ్.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. విమానంలో మధ్య సీట్లో కూర్చొనే వ్యక్తికే రెండు ఆర్మ్‌రెస్టులు ఉపయోగించాలని తెలిపారు. ‘‘విండో సీటు పక్కన ఉండే వ్యక్తికి పక్కకు జారబడేందుకు వీలు ఉంటుంది. దారి(Aisle) వైపు కూర్చొనే వ్యక్తికి కాస్త ఇటుగా జరిగి సౌకర్యంగా కూర్చొనే వీలు ఉంటుంది. కానీ, మధ్యలో కూర్చొనే వ్యక్తికి ఏ ఆధారం ఉండదు. అటూ ఇటూ కదల్లేడు. ఏ ఆధారం లేకపోతే పక్క వ్యక్తుల మీదకు జారబడాల్సి వస్తుంది. ఆర్మ్‌రెస్ట్ ఉంటే.. వాలిపోకుండా కూర్చోడం వీలవుతుంది. కాబట్టి.. రెండు ఆర్మ్‌రెస్టుల మీద చేతులు పెట్టుకుని ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై మీరు ప్రయాణాలు చేసేప్పుడు తప్పకుండా ఈ రూల్ పాటించండి. మధ్య సీట్లో కూర్చొనే వ్యక్తులకు ఆర్మ్‌రెస్ట్ ఇచ్చి.. సౌకర్యంగా ప్రయాణించేందుకు సహకరించండి.