Pak Occupied Kashmir Issue: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని (Pak Occupied Kashmir) త్వరలోనే భారత్‌లో కలిపేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీనిపై జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పీఓకేని ఆక్రమిస్తుంటే చూస్తూ కూర్చోడానికి పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదని, అణుబాంబులతో మనపై దాడి చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ ఎలా అనుకుంటే అలా చేయొచ్చని కానీ వాటి పర్యవసానాలనూ దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు. 


"రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌లో కలిపేస్తామని చెబుతున్నారు. చేస్తే చేయనివ్వండి. అడ్డుకోడానికి మేమెవరం. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అలా చేస్తుంటే ఊరుకోడానికి పాకిస్థాన్‌ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. పాక్ వద్ద అణు బాంబులున్నాయి. వాటిని భారత్‌పై ప్రయోగించే ప్రమాదముంది"


- ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత 






ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో కలిసిపోయేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. భారత్‌లో తమని కలిపేయాలంటూ స్థానిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. 


"ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. త్వరలోనే భారత్‌లో కలిపేసుకుంటాం. భారత్‌ శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రతిష్ఠ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలూ భారత్‌లో కలిసిపోవాలనే కోరుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు"


- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి


విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ కూడా PoK అంశంపై స్పందించారు. ఇది భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ తీర్మానం తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించారు. భారతీయుల్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి మర్చిపోయే విధంగా చేశారని, ఇప్పుడిప్పుడే వాళ్లకి నిజాలు అర్థమవుతున్నాయని స్పష్టం చేశారు. 


"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ మన భారత్‌లో భాగమే. దీనికి సంబంధించిన తీర్మానం భారత్‌ వద్ద ఉంది. అలాంటప్పుడు అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఎలా ఉంటుంది..? వేరేవరికో ఆ ప్రాంతంపై అధికారం ఎందుకు ఉంటుంది..? ఇంట్లో సరైన వ్యక్తి లేకపోతే వేరెవరో వచ్చి ఆ ఇంటిని దోచేసుకుంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ కూడా అలాగే మన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది"


- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
 


Also Read: ED Raids: మంత్రి సెక్రటరీ ఇంట్లో కుప్పలుగా నోట్ల కట్టలు, గది నిండా పరిచి ఉన్న కరెన్సీ