Lok Sabha Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం కలుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు నియోజకవర్గంలో ఈ సమస్య వచ్చి పడింది. ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉందని అధికారులు వాపోతున్నారు. మే 7వ తేదీన లోక్‌సభ మూడో విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. కోర్బా ప్రాంతంలో భారీ సంఖ్యలో ఏనుగులు (Elephants in Korba) సంచరిస్తున్నాయని వెల్లడించారు. ఓటింగ్ జరిగే సమయంలో ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కోర్బా జిల్లాలోని దాదాపు 65 పోలింగ్ బూత్‌లపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏనుగుల దాడులు నమోదవుతున్నాయని, అందుకే ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి గ్రామానికీ వెళ్లి అక్కడి ఓటర్లతో మాట్లాడుతున్నారు. వీలైనంత వరకూ ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లేలా (Elephants Attack) చూడాలని చెబుతున్నారు. కోర్బా జిల్లా కలెక్టర్ కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఏనుగులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ట్రాక్ చేస్తున్నామని, పోలింగ్ రోజు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.
"జిల్లాలో కొన్ని చోట్ల ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఆ ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. కోర్బా జిల్లాని రెండు ఫారెస్ట్ డివిజన్‌లు విభజించాం. అక్కడి ప్రజలనీ అప్రమత్తం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. సాయంత్రం ఈ దాడులు ఎక్కువగా జరిగే ప్రమాదముంది. అది పోలింగ్‌పై ప్రభావం చూపిస్తుండొచ్చు. ఇది పంటలు చేతికొచ్చే కాలం. వాటిని తినేందుకు గుంపులు గుంపులుగా ఏనుగులు తరలి వస్తాయి. అందుకే ఉదయమే వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం"
- అటవీ అధికారులు
అటవీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..ఏనుగులను రాత్రి పూట సంచరిస్తుంటాయి. వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఏనుగులను గేట్‌వేగా పిలుచుకునే కోర్బాలో మనుషులపై దాడులు పెరుగుతున్నాయి. 2019-23 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడుల్లో కనీసం 245 మంది ప్రాణాలు కోల్పోయారు.