Pakistan Economic Crisis:


15 కిలోల పిండి రూ.2,050. 
బ్రెడ్ ప్యాకెట్ రూ.200
లీటర్ పాలు రూ.190
కిలో టమాటా రూ.240
లీటర్ ఆయిల్ రూ.580
సిలిండర్ ధర రూ.10,000


అప్పుల కుప్పలు..


చూస్తుంటేనే దిమ్మ తిరిగిపోతోంది కదా. ఈ ధరల పట్టిక శ్రీలంకలోది కాదు. మన దాయాది దేశం పాక్‌లోది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయింది పాకిస్థాన్. కరెంట్ బిల్స్ కట్టలేక దేశంలోని చాలా చోట్ల షాపింగ్ మాల్స్‌ని బంద్ చేయించింది ప్రభుత్వం. అంతే కాదు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడా విద్యుత్‌ని  వాడడం లేదు. పిండి, చక్కెర, నెయ్యి..ఇలా ఏది కొందామన్నా ధరలు భగ్గుమంటున్నాయి. తీసుకున్న అప్పులు కట్టలేక, కొత్త అప్పు పుట్టక నానా అవస్థలు పడుతోంది పాకిస్థాన్‌. ఇక విదేశీ మారక నిల్వలూ అడుగంటుతున్నాయి. రాజకీయ అనిశ్చితి ఇప్పటికే కొనసాగుతోంది. జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మధ్యే పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం 1,167 ఖాళీలకు ఎగ్జామ్ పెడితే...30 వేల మంది హాజరయ్యారు. కాలేజీల్లో చోటు సరిపోక ఓ స్టేడియంలో ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. 
అంటే...అక్కడి యువత ఉద్యోగాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. పాక్ తన ఎంబసీ కార్యాలయాన్ని అమెరికాకు అమ్ముకునేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశ పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదొక్కటే కాదు. ఇంకెన్నో ఉదాహరణలున్నాయి. 


ఇవీ కారణాలు..


పాక్ ప్రజలు కనీస సౌకర్యాలకూ అల్లాడిపోతున్నారు. మ్యారేజ్‌ హాల్స్‌, మార్కెట్‌లు, వ్యాపార సముదాయాలు అన్నీ బంద్ చేశారు. ఇక చమురు ధర కూడా అక్కడి ప్రజలకు చురకలు అంటిస్తోంది. చమురు వినియోగం కోసం దిగుమతులపైనే ఆధార పడుతోంది పాక్. ఫలితంగా...పెట్రో ధరలూ మండి పోతున్నాయి. అన్ని ఆఫీస్‌ల్లో విద్యుత్ వినియోగాన్ని 30% వరకూ తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశీ మారక నిల్వలు అనూహ్య స్థాయిలో పడిపోయాయి. దాదాపు 6.7 బిలియన్ డాలర్ల మేర కోత పడింది. పాక్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనా కూడా ఈ మధ్య కాలంలో వెనక్కి తగ్గింది. ఫలితంగా...పరిస్థితులు మరింత దిగజారాయి. రాజకీయంగానూ స్థిరత్వం లేకపోవడం మరో సవాలు. విద్యుత్‌ని ఆదా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాత్రి 8.30గంటల కల్లా మార్కెట్‌లు బంద్ చేయాలని ఆదేశించింది. కొన్ని చోట్ల మాత్రమే మ్యారేజ్‌ హాల్స్‌కు అనుమతి ఇస్తున్నారు.


ఇక ఫ్యాన్‌లు, లైట్‌లు వెలగడంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఏడాది జులై వరకూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. వీధి దీపాలూ వెలగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలూ అందడం లేదు. పేదరికంతో విలవిలలాడుతున్నారు ప్రజలు. రెండేళ్లలో పేదల సంఖ్య 35.7% మేర పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది పాక్. అమెరికన్ డాలర్‌తో పోల్చి చూస్తే పాకిస్థాన్ కరెన్సీ రూ. 49.31కి పడిపోయింది. ద్రవ్యోల్బణం 30-40% మధ్యలో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాక్‌...కొవిడ్ తరవాత మరింత పతనమైంది. ప్రజల ఆదాయం పడిపోయింది. చెల్లింపులు తగ్గిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రభావం చూపించింది. దిగుమతుల వ్యయం పెరిగిపోయింది. ముఖ్యంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఆహార అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటమూ ఇబ్బందికరంగా మారింది. ట్రేడ్ డెఫిసిట్ 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 16% మేర పడిపోయాయి. ఈ సమస్యల వల్ల పాకిస్థాన్‌కు దుర్భర స్థితిలో ఉంది. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. 


Also Read: Air India Urination Case: విమానంలో మహిళపై యూరినేట్ చేసిన వ్యక్తి అరెస్ట్, ఢిల్లీ పోలీసుల పక్కా స్కెచ్